iyr krushnarao: ఓట్లు వేసి గెలిపించిన రెండు కులాలపై ఉన్న శ్రద్ధ ఇదేనా?: బాబుపై మరోమారు విరుచుకుపడ్డ ఐవైఆర్
- బ్రాహ్మణ కార్పొరేషన్ కు ఇన్ ఛార్జీ ఎండీని నియమించారు
- కాపు కార్పొరేషన్ కు జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి
- కాపు, బ్రాహ్మణ కులాలపై ఉన్న శ్రద్ధ ఇదేనా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మరోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యవహారశైలిపై విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ మాధ్యమంగా స్పందించిన ఆయన, గత ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తెచ్చిన రెండు కులాలపై ఆ పార్టీకి చిత్త శుద్ది లేదని ఆరోపించారు. చిత్తశుద్ధి ఉంటే బ్రాహ్మణ, కాపు కార్పొరేషన్లపై నిర్లక్ష్యం వహించదని ఆయన మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ కు ఐఏఎస్ అధికారి పద్మను నియమించకముందు ఆరునెలల పాటు బ్రాహ్మణ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టరే (ఎండీ) లేరని గుర్తుచేశారు. ఆమెను అక్కడి నుంచి బదిలీ చేసి, ఆ శాఖ బాధ్యతలు ఆమెనే (ఇన్ ఛార్జీ) చూసుకొమ్మని చెప్పారు. ఇది సరైనదేనా? అని ఆయన ప్రశ్నించారు. అలాగే 1,000 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగే కాపు కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా కనీసం ఐఏఎస్ అధికారిని కూడా నియమించకుండా జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారికి ఆ బాధ్యతలు కట్టబెట్టారని ఆయన మండిపడ్డారు.