UNO: ఇరు దేశాలు అంగీకరిస్తేనే మధ్యవర్తిత్వం!: కశ్మీర్ పై ఐక్యరాజ్యసమితి చీఫ్
- కశ్మీర్ వివాద పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహించేందుకు సిిద్ధమన్న యూఎన్వో చీఫ్
- రెండు దేశాలు అంగీకరిస్తే మధ్యవర్తిత్వానికి సిద్ధం
- కశ్మీర్ భారత్ లో అంతర్భాగమని, మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదంటున్న భారత్
కశ్మీర్ వివాదం చర్చలతోనే పరిష్కారమవుతుందని ఐక్యరాజ్యసమితి (యూఎన్ఓ) చీఫ్ ఆంటోనియో గుటెరస్ పేర్కొన్నారు. కశ్మీర్ వివాదం పరిష్కరించేందుకు భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేసేందుకు సుముఖంగా ఉన్నామని ఆయన ఆసక్తి వ్యక్తం చేశారు. కానీ అందుకు భారత్, పాక్ లు అంగీకారం తెలపాలని ఆయన స్పష్టం చేశారు. రెండు దేశాలు అంగీకారం తెలిపితేనే వివాదం పరిష్కారానికి తమ వంతు కృషి చేయగలుగుతామని ఆయన తెలిపారు.
దీనిపై యూఎన్ సెక్రటరీ జనరల్ ప్రతినిధి స్టీఫెన్ దుజార్రిక్ మాట్లాడుతూ, భారత్-పాక్ మధ్య నెలకొన్న కశ్మీర్ వివాదాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈ వివాదాన్ని పరిష్కరించడంలో మధ్యవర్తిత్వం వహించేందుకు గుటెరస్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కాగా, ఐక్యరాజ్యసమితి వేదికపై సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహించాలని వివిధ సందర్భాల్లో పాక్ కోరగా, కశ్మీర్ విషయంలో వివాదం లేదని, కశ్మీర్ భారత్ లో అంతర్భాగమని, సమస్య పరిష్కారానికి మూడో వ్యక్తి మధ్యవర్తిత్వం అవసరం లేదని భారత్ పలుమార్లు తేల్చి చెప్పింది.
పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ భారత బలగాలపై దాడులకు పాల్పడుతుండడంతో జవాన్లతో పాటు, పౌరులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.