graeme smith: ఇదేం నాయకత్వం.. కెప్టెన్ ఇలాగేనా ప్రవర్తించేది?: కోహ్లీపై గ్రేమ్ స్మిత్ విమర్శ
- డ్రెస్సింగ్ రూమ్ లో కోహ్లీని ప్రశ్నించేవారే లేరు
- అతడి ఆలోచనలతో విభేదించేవారు కూడా ఉంటే జట్టుకు మేలు జరుగుతుంది
- మైదానంలో అతని తీరు సహచరులపై ప్రతికూల ప్రభావం చూపే విధంగా వుంది
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడే కానీ...గొప్ప నాయకుడేనా? అంటూ కోహ్లీ నాయకత్వ ప్రతిభపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ అనుమానం వ్యక్తం చేశాడు. కోహ్లీ టీమిండియాకు దీర్ఘకాలిక కెప్టెన్ గా కొనసాగుతాడని అనిపించడం లేదని అభిప్రాయపడ్డాడు. డ్రెస్సింగ్ రూమ్ లో కోహ్లీని ప్రశ్నించేవారే లేరని అన్నాడు. జట్టులో అతడి ఆలోచనలతో విభేదించేవారు కూడా ఉంటే జట్టుకు మేలు జరుగుతుందని స్మిత్ పేర్కొన్నాడు.
కోహ్లీతో మాట్లాడి అతడి ఆలోచనలను సవాల్ చేస్తూ, నిర్మాణాత్మకంగా వ్యవహరించే సహాయ సిబ్బంది సహకారం అతడికి అవసరమని పేర్కొన్నాడు. అంతే కాకుండా గ్రౌండు లో ఏ ఆటగాడు ఎలా ఉండాలో కోహ్లీ పరిమితులు విధించాడని, మైదానంలో అతని తీరు, భావోద్వేగాలు సహచరులపై ప్రతికూల ప్రభావం చూపే విధంగా ఉన్నాయని ఆరోపించాడు. ఇలాగే దూకుడుగా, కోపంగా ఉంటే అతనిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నాడు.
భారత్ కు కోహ్లీ సుదీర్ఘకాలం కెప్టెన్ గా మనగలుగుతాడో లేదో చెప్పడం కష్టమని అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే ఈ ఏడాది ముగిసే వరకు అతడు విదేశాల్లోనే పర్యటించాల్సి ఉందని గుర్తు చేశాడు. ఆ సమయంలో అతను తీవ్ర ఒత్తిడి అనుభవించాల్సి ఉంటుందని చెప్పాడు. ప్రధానంగా మీడియా నుంచి ఇష్టంలేని ప్రశ్నలు ఎదుర్కోవాల్సి రావొచ్చని అన్నాడు. సొంత దేశంలో అతడికి మద్దతు దొరకొచ్చేమో గానీ విదేశాల్లో మాత్రం అలా కుదరదని కుండబద్దలు కొట్టాడు. జట్టు పరంగా విఫలమై ఇబ్బందులు పడుతుంటే ఆ భారం కోహ్లీ మోయగలడో లేదో చెప్పడం కష్టం అన్నాడు. జట్టును పదేపదే మార్చడం కోహ్లీకి ప్రతికూలంగా మారుతోందని స్మిత్ పేర్కొన్నాడు.