Revanth Reddy: 9 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై రాష్ట్రపతి, ఈసీకి రేవంత్ రెడ్డి ఫిర్యాదు.. వేటు వేయాలని విన్నపం
- లాభదాయక పదవుల్లో ఉన్నారు
- హైకోర్టు కూడా వీరి నియామకాలను రద్దు చేసింది
- ఆప్ ఎమ్మెల్యేల మాదిరే వీరిపై కూడా అనర్హత వేటు వేయండి
టీఆర్ఎస్ పార్టీకి చెందిన 9 మంది ఎమ్మెల్యేలపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. లాభదాయకమైన పదవుల్లో వీరు ఉన్నారని ఈ సందర్భంగా రేవంత్ ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలపై వేటు వేసినట్టుగానే, వీరిపై కూడా చర్యలు తీసుకోవాలని, అనర్హులుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన లేఖలు రాశారు.
ఆరుగురు ఎమ్మెల్యేలను పార్లమెంటు కార్యదర్శులుగా నియమించారని, మిగిలినవారు లాభదాయక పదవుల్లో ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. వీరిలో వినయ్ భాస్కర్, జలగం వెంకట్రావులను సీఎం కార్యాలయంలో సెక్రటరీలుగా నియమించారని తెలిపారు. శ్రీనివాస్ గౌడ్, సతీష్ కుమార్ లను డిప్యూటీ సీఎం కార్యాలయాల్లో సెక్రటరీలుగా నియమించారని చెప్పారు. రాజ్యాంగ విరుద్ధమైన పదవుల్లో ఉన్నారంటూ గతంలో హైకోర్టు కూడా వీరి నియామకాలను రద్దు చేసిందని లేఖలో పేర్కొన్నారు.