actor shivaji raja: సినీ నటులపై పాపారావు వ్యాఖ్యలు బాధాకరం: నటుడు శివాజీరాజా
- తెలంగాణ ప్రభుత్వం సినీ రంగాన్ని ఎంతగానో ఆదరిస్తోంది
- సినీ నటులను సన్మానించరాదనే వ్యాఖ్యలు బాధాకరం
- పాపారావు వ్యాఖ్యలు ఎంతవరకు సబబు?
సినిమా, సమాజం వేర్వేరు కాదని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, నటుడు శివాజీ రాజా అన్నారు. ప్రజలతో మమేకమైన రంగం సినీరంగమని చెప్పారు. ప్రజల సమస్యల పట్ల, సమాజ సమస్యల పట్ల సినీ కళాకారులు తొలినాళ్ల నుంచి కూడా స్పందిస్తున్నారని, తమ వంతు సహాయ సహకారాలను అందిస్తున్నారని అన్నారు. సినీ కళాకారులను సన్మానించకూడదంటూ కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ వ్యవస్థాపక సభ్యుడు, ప్రభుత్వ సలహాదారుడు పాపారావు వ్యాఖ్యానించడం విచారించదగ్గ అంశమని చెప్పారు.
ఇటీవల జరిగిన కాకతీయ కళావైభవం కార్యక్రమంలో మోహన్ బాబును సన్మానించడాన్ని పాపారావు తప్పుబట్టిన సంగతి తెలిసిందే. కాకతీయ కళా వైభవం పేరుతో సినీ నటులను సన్మానిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో శివాజీ రాజా మాట్లాడుతూ, తెలుగు వైభవాన్ని చాటి చెప్పేలా, సినీరంగ కళాకారులను ఆదరిస్తూ, ఆర్థిక సహకారం అందిస్తూ తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళుతోందని... ఇలాంటి పరిస్థితుల్లో సినీ నటులను సన్మానించకూడదన్న వ్యాఖ్యలు ఎంత వరకు సబబని ఆయన ప్రశ్నించారు.