USA: తిరిగి ప్రారంభమైన ట్రంప్ సర్కారు పాలన!
- మూడు రోజుల క్రితం తిరస్కరణకు గురైన ద్రవ్య వినిమయ బిల్లు
- షట్ డౌన్ అయిన అమెరికా ప్రభుత్వం
- తాజా సెనెట్ సమావేశంలో 81-18 తేడాతో బిల్లుకు ఆమోదం
అత్యంత కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లు తిరస్కరణకు గురై, సుప్త చేతనావస్థలోకి వెళ్లిపోయిన అమెరికా ప్రభుత్వం, తిరిగి పని మొదలు పెట్టింది. ప్రభుత్వాన్ని, పాలనను తిరిగి ప్రారంభించేలా స్వల్పకాలిక స్పెండింగ్ బిల్ కు సెనెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై ట్రంప్ సంతకం చేస్తే, మూతబడిన ప్రభుత్వం తిరిగి తెరచుకుంటుంది.
సోమవారం జరిగిన సెనెట్ సమావేశంలో 81 మంది సెనెటర్లు, ముఖ్యంగా డెమోక్రాట్లు బిల్లుకు ఓకే చెప్పారు. మరో 18 మంది దీన్ని వ్యతిరేకించారు. దీంతో మూడు రోజుల పాటు షట్ డౌన్ అయిన యూఎస్ ప్రభుత్వం, మరో మూడు వారాల పాటు పాలనా పరమైన ఇబ్బందులను అధిగమించనుంది. ఈ మూడు వారాల వ్యవధిలో బిల్లులను తిరిగి చర్చించి, తుది ఆర్థిక బిల్లుకు ఆమోదం తెలపాల్సి వుందని యూఎస్ ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. వచ్చే నెల 8వ తేదీ వరకూ పరిపాలన సాగుతుందని న్యూయార్క్ డెమొక్రటిక్ నేత చుక్ షుమర్ వెల్లడించారు. తామింకా చేయాల్సిన పని చాలా ఉందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.