Pawan Kalyan: సీఎం కేసీఆర్‌ని కలిస్తే తప్పేంటి?.. ప్రజలు ఓటుతో తీర్పునిస్తేనే ఆయన గెలిచారు!: పవన్ కల్యాణ్

  • నూతన సంవత్సరం రోజున కేసీఆర్ ని కలిసి శుభాకాంక్షలు చెప్పాను
  • దశాబ్దాల పోరాటం తరువాత తెలంగాణ వచ్చింది
  • విడిపోయిన తరువాత ఇరు రాష్ట్రాలకు చాలా చాలెంజ్‌లు ఉంటాయి
  • ప్రజా సమస్యలపై ఎలా పడితే అలా తాను మాట్లాడను

విడిపోయిన తరువాత ఇరు రాష్ట్రాలకు చాలా చాలెంజ్‌లు ఉంటాయని, వీటి మధ్యలో ప్రభుత్వాలను చాలా సమర్థవంతంగా నడపాల్సి ఉంటుందని సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఏ పార్టీకైనా సరే ప్రజలు పట్టం కట్టినప్పుడు ఆయా ప్రభుత్వాలను గౌరవించాలని చెప్పారు. ఈ రోజు ఆయన కరీంనగర్‌లో మాట్లాడుతూ.. దశాబ్దాల తరువాత తెలంగాణ వచ్చిందని, తానెప్పుడూ సునిశితంగా ఆలోచిస్తానని, బాధ్యతగా ముందుకు వెళ్లాలని ఆలోచిస్తానని చెప్పారు.

సమస్యలను సానుకూలంగా ఎలా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలో ఆలోచించాలని పవన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిస్తే తప్పేంటని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. నూతన సంవత్సరం రోజున కేసీఆర్ ని కలిసి శుభాకాంక్షలు చెబితే ఇంత రచ్చ ఎందుకు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటంలో కేసీఆర్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. అనంతరం ప్రజలు ఓటుతో తీర్పునిస్తే ఆయన గెలిచారని చెప్పారు.

కాగా, ప్రజా సమస్యలపై ఎలా పడితే అలా తాను మాట్లాడలేనని చెప్పుకొచ్చారు. ప్రభుత్వాలపై విమర్శలు చేయడం కోసం తాను పని చేయనని, ప్రజా సమస్యలను అర్థం చేసుకుని, వాటిని ప్రభుత్వాల దగ్గరకు తీసుకువెళ్లి ఆ సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. విమర్శలు చేస్తూ రాజకీయాలను అస్థిరపర్చే ఉద్దేశం తనకు లేదని అన్నారు.  

  • Loading...

More Telugu News