stock: జోరుగా సాగిన దేశీయ మార్కెట్లు...ఆల్‌టైం రికార్డును సాధించిన సెన్సెక్స్!
- 35,798 వద్ద ముగిసిన సెన్సెక్స్
- 10,966 వద్ద ముగిసిన నిఫ్టీ
- గతవారం రోజుల నుంచి లాభాల్లో నడుస్తున్న సూచీలు
గతవారం కొనసాగించిన జోరునే ఈ వారం కూడా దేశీయ మార్కెట్లు కొనసాగిస్తున్నాయి. రానున్న కేంద్ర బడ్జెట్‌పై మదుపర్లు సానుకూలంగా ఉండటం, బ్యాంకింగ్ షేర్ల అండతో సూచీలు లాభాల బాటలోనే సాగుతున్నాయి. ఇవాళ కూడా ఉదయం నుంచి ట్రేడింగ్ లాభాలతోనే జరిగింది. 100 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను ఆరంభించిన సెన్సెక్స్.. మార్కెట్ ముగిసే సమయానికి 286 పాయింట్లు ఎగబాకి 35,798 వద్దకు చేరుకుని ఆల్‌టైం రికార్డును సృష్టించింది.
ఇక నిఫ్టీ కూడా కొత్త రికార్డు వైపు దూసుకెళ్లింది. 71 పాయింట్లు లాభపడి 10,966 వద్ద స్థిరపడి, 11వేల రికార్డు మార్కుకు కేవలం 34 పాయింట్ల దూరంలో నిలిచింది. ఎన్‌ఎస్‌ఈలో టీసీఎస్, రిలయన్స్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, ఓఎన్‌జీసీ, యాక్సిస్ బ్యాంకు షేర్లు లాభపడగా.. హిందుస్థాన్ పెట్రోలియం, గెయిల్, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ, భారత్ పెట్రోలియం షేర్లు నష్టపోయాయి. కాగా, డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.63.77గా కొనసాగుతోంది.