rich: మన దేశంలో 73 శాతం సంపదను సృష్టించింది ఒక్క శాతం మంది సంపన్నులే!
- ఆదాయ అసమానతలపై ఆక్స్ ఫామ్ సర్వే
- మన దేశంలో ఒక్క శాతం మంది సంపద కేంద్ర బడ్జెట్ కు సమానం
- ఆర్థిక విధానాలు సంపన్నులకే మేలు చేస్తున్నాయన్న ఆక్స్ ఫామ్
గతేడాది దేశంలో 73 శాతం సంపదను సృష్టించింది ఒక శాతం సంపన్నులేనని అంతర్జాతీయ హక్కుల గ్రూపు ఆక్స్ ఫామ్ నిర్వహించిన సర్వే తేల్చింది. ఆదాయ అసమతుల్యతను ఈ సర్వే కళ్లకు కట్టింది. దేశంలో 67 కోట్ల మంది సంపద మాత్రం ఇదే సమయంలో కేవలం 1 శాతమే పెరగడం గమనార్హం. అంతర్జాతీయంగా చూస్తే సంపద అసమానతలు ఇంకా ఎక్కువే ఉన్నాయని ఆక్స్ ఫామ్ ఈ రోజు విడుదల చేసిన నివేదిక ప్రకారం తెలుస్తోంది.
గతేడాది అంతర్జాతీయంగా 82 శాతం సంపద కేవలం ఒక శాతం సంపన్నుల చేతుల్లోనే ఉండడం గమనించాల్సిన అంశం. అదే సమయంలో 370 కోట్ల మంది ప్రజల సంపదలో ఏ మాత్రం ఎదుగూ బొదుగూ లేదు. దేశంలో మొత్తం సంపదలో 58 శాతం ఒక్క శాతం సంపన్నుల చేతుల్లోనే ఉందని ఈ సర్వేలో తేలింది. అంతర్జాతీయంగా చూస్తే ఒక శాతం సంపన్నుల చేతుల్లో 50 శాతం ప్రపంచ సంపద మూలుగుతోంది.
మనదేశంలో ఒక శాతం మంది ఉన్నత వర్గాల వద్దనున్న సంపద 2017లో రూ.20.9 లక్షల కోట్లకు పెరిగింది. ఇది 2017-18 ఆర్థిక సంవత్సరం కేంద్ర బడ్జెట్ కు సమాన స్థాయి అని ఆక్స్ ఫామ్ పేర్కొంది. వందల కోట్ల మంది పేదరికంతో పోరాడుతుంటే, సంపన్న వర్గాలు మరింత భారీగా సంపదను పోగు చేసుకునేలా అంతర్జాతీయ ఆర్థిక విధానాలు తోడ్పడుతున్నాయని విమర్శించింది.