CBDT: ఎన్నిసార్లు అడిగినా లెక్కలు చెప్పని 2 లక్షల మందిపై కేంద్రం కన్ను!

  • నోట్ల రద్దు తరువాత రూ. 20 లక్షలు మించి జమ చేసిన వారికి నోటీసులు
  • డబ్బు ఎక్కడిదని ప్రశ్నిస్తున్న ఐటీ, సీబీడీటీ
  • ఖజానాకు పన్ను ఆదాయం పెంచడమే లక్ష్యం

ఇండియాలో పెద్ద నోట్లను రద్దు చేసిన తరువాత, తమ బ్యాంకు ఖాతాల్లో రూ. 20 లక్షలకన్నా ఎక్కువ మొత్తాలను జమ చేసిన దాదాపు రెండు లక్షల మందికి కేంద్ర ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోటీసులు పంపించారు. ఆ డబ్బులకు లెక్కలు చెప్పాలని ఇప్పటికే పలుమార్లు వారిని సంప్రదించామని, వారెవరూ ఐటీ రిటర్నులు దాఖలు చేయలేదని ఓ సీనియర్ అధికారి తెలిపారు. "సమాధానం చెప్పేందుకు వారికి ఎంతో సమయం ఇచ్చాం. వార్షిక రిటర్నులు దాఖలు చేయాలని పదే పదే అడిగాము. వారు మాత్రం స్పందించలేదు. ఇక నోటీసులు పంపడం మినహా మా ముందు మరో దారి లేకపోయింది" అని ఆయన అన్నారు.

కాగా, ఆదాయపు పన్ను రాబడిని మరింతగా పెంచుకోవాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్న నరేంద్ర మోదీ సర్కారు, పన్ను ఎగవేతదారులపై ప్రత్యేక దృష్టిని సారించింది. ఇప్పటికే రికవరీ యాక్షన్ ను ప్రారంభించిన సీబీడీటీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్), పన్ను ఎగవేతదారులు ధైర్యంగా తిరగలేని పరిస్థితులు తీసుకురావాలన్న ఉద్దేశంలో ఉంది. ఇక ఎగవేతదారుల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసుకున్న సీబీడీటీ చైర్మన్ సుశీల్ చంద్ర, తన టీమ్ తో వారిపై దాడులు చేయిస్తున్నారు. 2016లో డీమానిటైజేషన్ డ్రైవ్ చేపట్టిన తరువాత, రూ. 5 లక్షలకు పైగా డబ్బును బ్యాంకుల్లో వేసిన 18 లక్షల మంది డిపాజిట్ దారులను గుర్తించిన, సీబీడీటీ, వాటిల్లో 12 లక్షల ఖాతాలను ఇన్ కం టాక్స్ పోర్టల్ మాధ్యమంగా వెరిఫై చేసింది.

ఇక అనుమానాస్పద ఖాతాల్లో రూ. 2.9 లక్షల కోట్ల డబ్బు జమ అయిందని, మొత్తం రద్దయిన నోట్లలో ఇది ఐదో వంతని అధికారులు అంటున్నారు. ఖాతాల్లో డిపాజిట్ చేసిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని తాము ప్రశ్నిస్తే, ఐదు లక్షల మంది స్పందించారని సీబీడీటీ వర్గాలు తెలిపాయి. సమాధానం ఇవ్వని వారికి నోటీసులు పంపినట్టు వెల్లడించాయి. కాగా, తొలి దశలో రూ. 50 లక్షలకు పైగా డిపాజిట్లు చేసిన 70 వేల మంది నుంచి లెక్కలు సేకరించనున్నామని అధికారులు అంటున్నారు.

  • Loading...

More Telugu News