Pawan Kalyan: పవన్ కల్యాణ్ పర్యటనను అడ్డుకుంటాం: పొన్నం ప్రభాకర్ హెచ్చరిక
- ఉద్యమ సమయంలో పవన్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి
- అప్పుడే కొండగట్టులో అడుగుపెట్టాలి
- మొక్కు తీర్చుకునేందుకు పవన్ వస్తే అభ్యంతరం లేదు
- రాజకీయ మనుగడ కోసం వస్తే ఊరుకోం: కాంగ్రెస్ నేత పొన్నం
ప్రజా సమస్యలను అధ్యయనం చేసేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రేపటి నుంచి తెలంగాణలో యాత్ర ప్రారంభించనున్న విషయం తెలిసిందే. తన యాత్ర పర్యటన వివరాలను కొండగట్టులో రేపు ప్రకటిస్తానని పవన్ పేర్కొనడమూ విదితమే. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ, పవన్ తలపెట్టనున్న యాత్రను అడ్డుకుంటామని అన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో పవన్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, అప్పుడే కొండగట్టులో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. కొండగట్టులో మొక్కు తీర్చుకునేందుకు పవన్ వస్తే తమకు అభ్యంతరం లేదు కానీ, రాజకీయ మనుగడ కోసం వస్తే మాత్రం ఊరుకోమని హెచ్చరించారు. నిరాహార దీక్ష చేస్తానంటే కోదండరామ్ కు పర్మిషన్ ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం, పవన్ చేపట్టనున్న యాత్రకు ఎలా అనుమతిచ్చిందని ప్రశ్నించారు. కేసీఆర్- పవన్ మధ్య కుదిరిన చీకటి ఒప్పందాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు.