governor narasimhan: ఇంకా నయం.. రాజ్ భవన్ ను టీఆర్ఎస్ భవన్ అనలేదు!: గవర్నర్ నరసింహన్ పై నిప్పులు చెరిగిన భట్టి

  • గవర్నర్ శైలి విచిత్రంగా ఉంది
  • రాజ్ భవన్ ను పొరపాటున టీఆర్ఎస్ భవన్ గా మార్చవద్దు
  • ప్రాజెక్టు వ్యయం ఎందుకు పెరిగిందో ప్రశ్నించారా?

కాళేశ్వరం ప్రాజెక్టు అత్యద్భుతమంటూ గవర్నర్ నరసింహన్ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టును పూర్తి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ను కాళేశ్వరం చంద్రశేఖరరావుగా, మంత్రి హరీష్ రావును కాళేశ్వర్ రావుగా ఆయన అభివర్ణించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ పై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు.

రాజ్యాంగాన్ని, రాజ్ భవన్ ను నరసింహన్ అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. నరసింహన్ వ్యవహారశైలితో గవర్నర్ వ్యవస్థకే అపకీర్తి వస్తోందని విమర్శించారు. కాళేశ్వరంపై గవర్నర్ తీరు విచిత్రంగా ఉందని అన్నారు. కేసీఆర్, హరీష్ ల పేర్లు మాత్రమే మార్చినందుకు సంతోషంగా ఉందని... మరిచిపోయి రాజ్ భవన్ పేరును కూడా టీఆర్ఎస్ భవన్ గా మార్చేస్తారేమో అంటూ ఎద్దేవా చేశారు.

అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు పేరు మార్పుపై ఎందుకు ప్రశ్నించలేదని భట్టి అన్నారు. రూ. 20 వేల కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు బడ్జెట్ ఎందుకు పెరిగిందో ప్రశ్నించారా? అని మండిపడ్డారు. ఆహా, ఓహో అంటూ పొగిడేముందు... ఆ ప్రాజెక్టును ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News