praveen togadia: ఆర్ఎస్ఎస్ లో తీవ్ర కలకలం...తొగాడియా తొలగింపా?
- ఎన్ కౌంటర్ కుట్ర జరుగుతోందంటూ గత సోమవారం మీడియా ముందుకు వచ్చిన ప్రవీణ్ తొగాడియా
- ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ, బీజేపీలో కలకలం
- నష్టనివారణ చర్యలకు పూనుకున్న ఆర్ఎస్ఎస్
తనను ఎన్ కౌంటర్ చేసేందుకు కుట్ర జరిగిందని వీహెచ్పీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా గత సోమవారం మీడియా ముందుకు వచ్చి కన్నీటిపర్యంతమైన సంగతి తెలిసిందే. ఆయన ఆరోపణల అనంతరం సంఘ్ పరివార్ లో వాటిపై పెద్ద చర్చ జరిగింది. అనంతరం ఆయనను అడ్డు తొలగించుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది? అంటూ ఆర్ఎస్ఎస్ వర్గాల్లో చర్చ నడిచింది.
అయోధ్యలో రామమందిర నిర్మాణం, సంపూర్ణ గోవధ నిషేధం అంశాల్లో మోదీ నిరాసక్తంగా వ్యవహరిస్తున్నారని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో మోదీ విఫలమయ్యారంటూ విమర్శలు చేసిన తొగాడియా ఒక పుస్తకాన్ని రాస్తున్నారని, అది దాదాపు పూర్తికావచ్చిందని, అందులో మోదీ ప్రతిష్టను దెబ్బతీసే అంశాలున్నట్లు వార్తలు వినిపించాయి.
ఆ పుస్తకంలో రామజన్మభూమి ఉద్యమం ద్వారా బీజేపీ ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందిందీ, ఏయే నాయకులు ఏ విధంగా లాభపడిందీ తదితర అంశాలను ఆయన సవివరంగా పొందుపరిచినట్టు అంతర్గత సమాచారం. ఆ పుస్తకం విడుదలైతే 2019 ఎన్నికల్లో బీజేపీపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ప్రవీణ్ తొగాడియాపై క్రమశిక్షణ చర్యలు తీసుకుని, నష్టనివారణ చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్టు ఆర్ఎస్ఎస్ ఢిల్లీ, నాగ్ పూర్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనపై కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ విషయాలేవీ అధికారికంగా బహిర్గతం కానప్పటికీ, ఒకట్రెండు రోజుల్లో దానికి సంబంధించిన నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.