netflix: నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలు చూసేందుకు ఓ థియేటర్!
- ప్రారంభించిన బెంగళూరు స్టార్టప్ టెరిఫ్లిక్స్
- గంటకు రూ. 1299, 18 మంది కూర్చునే సదుపాయం
- 135 అంగుళాల స్క్రీన్, డాల్బీ డిజిటల్ సౌండ్
స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగిన తర్వాత పెయిడ్ స్ట్రీమింగ్ సర్వీసుల ఆధిపత్యం పెరిగింది. హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, హూక్ వంటి సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ టీవీల్లో ఇష్టమైన కార్యక్రమాలు, సినిమాలు చూసుకునే అవకాశం వీటి ద్వారా కలుగుతోంది. అయితే స్మార్ట్‌ఫోన్లు, టీవీల్లో చూస్తే థియేటర్లో చూసే అనుభూతి కలగదు. అందుకే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలోని కార్యక్రమాలను చూడటానికి ప్రత్యేకంగా ఓ థియేటర్‌ను బెంగళూరు స్టార్టప్ కంపెనీ టెరిఫ్లిక్స్ ఏర్పాటు చేసింది.
నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోల్లో సభ్యత్వం ఉన్న వారు ఈ థియేటర్‌కి వెళ్లి 135 అంగుళాల స్క్రీన్‌లో, డాల్బీ డిజిటల్ సౌండ్‌తో కార్యక్రమాలు, సినిమాలు చూడొచ్చు. అంతేకాకుండా కుటుంబంతో, స్నేహితులతో కలిసి చూసేందుకు వీలుగా ఇందులో 18 సీట్లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం గంటకు మొత్తం రూ. 1299 చెల్లించాల్సి ఉంటుంది. బెంగళూరులోని గిరినగర్‌లో ఈ థియేటర్ ఉంది. 100 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండటంతో సినిమా చూసేటపుడు ఎక్కడా అంతరాయం ఉండదు.
ప్రవీణ్, ప్రశాంత్ అనే ఇద్దరు టెకీలు ఈ స్టార్టప్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 45 స్క్రీనింగ్స్ వేశారు. వారానికి కనీసం మూడు స్క్రీనింగ్‌లైనా వేస్తుంటామని వారు తెలిపారు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లతో పాటు త్వరలో హాట్‌స్టార్ వంటి ఇతర స్ట్రీమింగ్ సర్వీసెస్ లతో ఒప్పందం చేసుకుంటామని వారు వివరించారు. అంతేకాకుండా షార్ట్ ఫిల్మ్‌లు, యూట్యూబ్ వీడియోలు, ఫీచర్ ఫిల్మ్‌లను కూడా తాము ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రవీణ్, ప్రశాంత్‌లు పేర్కొన్నారు.