kathi mahesh: పోలీసులకు ఫిర్యాదు చెయ్.. నేను అండగా నిలుస్తా!: కత్తి మహేష్ కు దర్శకుడు ఎన్.శంకర్ సలహా
- పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఫలితం ఉంటుంది
- ఫలితం లేకపోతే, నీ వెంట నేనుంటా
- అవసరమైతే, పవన్ కల్యాణ్ తో మాట్లాడదాం
- ప్రతి పౌరుడు స్వేచ్ఛగా జీవించాలనేది ప్రభుత్వ లక్ష్యం: శంకర్
పవన్ కల్యాణ్ అభిమానులకు, ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్ కు మధ్య వివాదం సుమారు నాలుగు నెలలుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. తనను అసభ్య కామెంట్లతో, వేధింపుల పాలు చేస్తూ తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా పవన్ ఫ్యాన్స్ ప్రవర్తిస్తున్నారని, అలాంటి వ్యాఖ్యలు చేయకుండా పవన్ కల్యాణ్ ఓ ప్రకటన చేయాలని కత్తి మహేశ్ డిమాండ్ చేస్తున్న విషయమూ విదితమే.
ఈ నేపథ్యంలో ‘టీవీ 9’లో సుదీర్ఘంగా నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో కత్తి మహేశ్, ఆయనపై ఆరోపణలు చేసిన నిర్మాత రాంకీ పాల్గొన్నారు. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ ఫోన్ లైన్ లో మాట్లాడుతూ, ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని, ముందుగా ఓ పోలీస్ కంప్లయింట్ ఇవ్వాలని కత్తి మహేశ్ కు సూచించారు. కచ్చితంగా పోలీసుల నుంచి యాక్షన్ ఉంటుందని, ఫోన్ కాల్స్ ద్వారా వేధిస్తున్న వారు పవన్ కల్యాణ్ ఫ్యాన్సా? కాదా? అనే విషయం తేలుతుందని అన్నారు.
పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా ఫలితం లేకపోతే కనుక తాను కూడా కత్తి మహేశ్ తరపున నిలుస్తానని హామీ ఇచ్చారు. అవసరమైతే, పవన్ కల్యాణ్ ని కలిసి వాళ్ల ఫ్యాన్స్ ని నియంత్రించమని అడుగుదామని, ఇందులో ఎలాంటి తప్పు లేదని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపౌరుడు స్వేచ్ఛగా, వారి హక్కులను కాపాడుకుంటూ, ఎలాంటి భయాందోళనలు లేకుండా జీవించాలనేది ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ నేపథ్యంలో కత్తి మహేశ్ ను కాపాడుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని శంకర్ పేర్కొన్నారు.