revanth reddy: టీడీపీని టీఆర్ఎస్ లో కలపాలన్న మోత్కుపల్లి వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందన!
- టీడీపీని నాశనం చేసిందే కేసీఆర్
- కేసీఆర్ కు వ్యతిరేకంగా అందరూ ఏకం కావాలి
- కాంగ్రెస్ కు టీడీపీ వ్యతిరేకం అనే వాదనకు కాలం చెల్లింది
కేసీఆర్ సహా టీఆర్ఎస్ లో ఉన్నవారంతా టీడీపీవారేనని... ఈ నేపథ్యంలో తెలంగాణ టీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలంటూ మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ఇటీవలే టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలపై స్పందించారు. టీఆర్ఎస్ వ్యతిరేక పార్టీలు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు.
తెలంగాణలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామక్రమంలో టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉండాలా? లేదా వ్యతిరేకంగా ఉండాలా? అనే విషయాన్ని పార్టీలన్నీ ఆలోచించుకోవాలని చెప్పారు. కేసీఆర్ వల్లే తెలంగాణలో టీడీపీకి ఈ పరిస్థితి తలెత్తిందని... టీడీపీ నేతలు ఎటు వెళ్లినా అనవసరమని, కానీ ఆ పార్టీకి చెందిన బీసీ, ఎస్సీ కార్యకర్తలంతా కాంగ్రెస్ పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టీడీపీ పుట్టిందన్న చర్చకు కాలం చెల్లిపోయిందని చెప్పారు.
టీఆర్ఎస్ లో టీడీపీని విలీనం చేయాలంటూ మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదని తెలిపారు. మొన్నటి వరకు కేసీఆర్ కు అనుకూలంగా రాజకీయ పునరేకీకరణ జరిగిందని... ఇప్పుడు కేసీఆర్ కు వ్యతిరేకంగా పునరేకీకరణ జరగాల్సిన తరుణం ఆసన్నమైందని చెప్పారు. టీఆర్ఎస్ ను ఉంచాలా? లేదా దించాలా? అనే విషయాన్ని నిర్ణయించుకోవాలని అన్నారు.