gps: జీపీఎస్, పానిక్ బటన్ తప్పనిసరి చేస్తూ కేంద్ర రవాణాశాఖ ఆదేశాలు
- ప్రజా రవాణా వాహనాల్లో తప్పనిసరి
- అమలు చేయని రాష్ట్రాలపై ఆగ్రహం
- ఏప్రిల్ 1 వరకు గడువు
ఏప్రిల్ 1, 2018లోగా అన్ని ప్రజారవాణా వాహనాలు, ట్యాక్సీలు, బస్సుల్లో జీపీఎస్ పరికరాలు, పానిక్ బటన్ ఏర్పాటు చేయాలని కేంద్ర రవాణా శాఖ ఆదేశించింది. ఈ మేరకు ఓ ట్వీట్ ద్వారా వెల్లడించింది. గతంలో ఈ నిబంధనలు తీసుకువచ్చినప్పటికీ... కొన్ని రాష్ట్రాలు అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జీపీఎస్, పానిక్ బటన్ ఏర్పాటు చేయడానికి ఇదే తుది గడువని, మళ్లీ పొడిగించబోయేది లేదని స్పష్టం చేసింది.
వాహనాల్లో మహిళలపై దాడులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రజా భద్రతను పెంచేందుకు రవాణా శాఖ యోచిస్తోంది. బస్సులు, ట్యాక్సీల్లో జీపీఎస్, పానిక్ బటన్ ఉండటం వల్ల ప్రమాదాలను నివారించే అవకాశం ఉంది. అయితే మూడు చక్రాల వాహనాలు, ఈ-రిక్షాలకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు కల్పించింది. ఈ జీపీఎస్, పానిక్ బటన్.. రవాణా శాఖ, పోలీస్ కంట్రోల్ రూంకు అనుసంధానించి ఉంటాయి. ఆపదలో ఉన్న ప్రయాణికులు పానిక్ బటన్‌ను నొక్కగానే విషయం పోలీసులకు, రవాణాశాఖకు చేరుతుంది.