ram gopal varma: ప్రపంచంలో ఇటువంటి పిచ్చోళ్లు చాలా మంది ఉన్నారు!: రామ్ గోపాల్ వర్మపై సామాజిక కార్యకర్త దేవి సంచలన వ్యాఖ్యలు
- గాడ్, సెక్స్, ట్రూత్ పేరుతో శృంగారమే ప్రధానాంశంగా ఆర్జీవీ సినిమా
- మనిషి జంతువు కాదు.. జంతువు స్థాయి నుంచి దాటి వచ్చాడు
- ఆరోగ్యకరమైన ఆలోచనలు ఉంటే ఇటువంటి బూతు సినిమాలు అవసరం ఉండవు
- ప్రపంచంలో ఇటువంటి పిచ్చోళ్లు చాలా మంది ఉన్నారు
గాడ్, సెక్స్, ట్రూత్ పేరుతో శృంగారమే ప్రధానాంశంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా వల్ల శృంగారంపై ఉన్న అపోహలు చెరిగిపోతాయనేలా వర్మ చేస్తోన్న వ్యాఖ్యలపైన, ఆ సినిమాపైన సామాజిక కార్యకర్త దేవి మండిపడ్డారు.
తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... 'మనిషి జంతువు కాదు.. జంతువు స్థాయి నుంచి దాటి వచ్చాడు కాబట్టే కొన్ని గోప్యతలు అవసరం అయ్యాయి. మనుషుల స్థాయిలో ఉండదలుచుకోలేదంటూ, ఇలాగే చూపించదలుచుకున్నామంటూ ఇటువంటి సినిమాలు తీసి నాగరిక సమాజంలో బతుకుతోన్న వారిపై వదులుతారా? మీ జంతు లోకంలోకి ఈ నాగరిక సమాజం రావాలనుకోవడం లేదు.
ఇది బూతు సినిమా కాదని అంటున్నారు. ఇటువంటి సినిమాలు, వీడియోలు శారీరక ప్రక్రియలో క్రూరత్వాన్ని చూపుతాయి. పోర్నోగ్రఫీ ఎటువంటి దారుణాలకు దారి తీస్తుందో తెలుసుకుని మాట్లాడాలి. సమాజంలో సెక్స్‌పై ఉన్న చెడు భావాలను, చాదస్తాన్ని పోగొట్టడానికే ఇటువంటి వీడియోలు, సినిమాలు అని అంటున్నారు. పోర్నోగ్రఫీయే ఒక పెద్ద చాదస్తం. ఆరోగ్యకరమైన ఆలోచనలు, శరీరం కలిగిన వారికి కృత్రిమమైన ప్రేరకాలు, ఇటువంటి బూతు సినిమాలు అవసరం ఉండవు. ప్రపంచంలో ఇటువంటి (రామ్ గోపాల్ వర్మ లాంటి) పిచ్చోళ్లు చాలా మంది ఉన్నారు' అని దేవి పేర్కొన్నారు. రామ్ గోపాల్ వర్మ తీస్తోన్న సినిమాను ఖండించారు.