Hyderabad: ఇప్పటికీ పాత కరెన్సీని మారుస్తున్న ముఠా... ఎలాగో తెలుసుకునేందుకు నానా తంటాలూ పడుతున్న పోలీసులు!
- 2016 నవంబర్ లో రద్దయిన నోట్లు
- హైదరాబాద్ కేంద్రంగా ఇంకా మారుతున్నాయి
- 16 మందితో ముఠా, ఛేదించేందుకు పోలీసుల యత్నం
అవును, మీరు చదివింది నిజమే. దాదాపు 15 నెలల క్రితం ఇండియాలో రద్దయిన రూ. 500, రూ. 1000 కరెన్సీ ఇంకా మారుతోంది. కొత్త కరెన్సీ రూపంలోకి వస్తోంది. 16 మంది వ్యక్తులు ముఠాగా ఏర్పడి 40 శాతం కమిషన్ పై వీటిని మారుస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారుగానీ, రద్దయిన నోట్లను వారు ఎలా మారుస్తున్నారన్న విషయాన్ని తెలుసుకునేందుకు నానా తంటాలూ పడుతున్నారు.
ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, గత డిసెంబరులో మీరట్ లో ఓ బిల్డర్ ఇంట్లో రూ. 25 కోట్ల పాత నోట్లు పోలీసులకు పట్టుబడ్డాయి. ఆపై విచారించగా, హైదరాబాద్ కేంద్రంగా దళారీలు ఉన్నారని, వారు పాత నోట్లు మారుస్తున్నారని ఉప్పందించాడు. ఈ ముఠాకు ఆనంద్ ఖత్రీ అనే వ్యక్తి నాయకుడని గమనించిన పోలీసులు, కాన్పూర్ లోని ఆయన బంధుమిత్రులున్న ఇళ్లపై దాడులు చేయగా, గోతాల్లో కుక్కి పెట్టి పడేసున్న రద్దయిన కరెన్సీ భారీగా బయటపడింది. దాదాపు 80 మంది పోలీసులు 12 గంటల పాటు శ్రమించి, వీటిని లెక్కించగా, ఆ మొత్తం దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగానే ఉంది. దీంతో పోలీసులు అవాక్కయ్యారు.
కేసు మూలాలు హైదరాబాద్ కు కూడా విస్తరించాయని గుర్తించిన పోలీసులు, ఇక్కడా నిఘా పెట్టారు. ఖత్రి పాత నోట్లను తెస్తుండగా, రాజేశ్వరి రంగారావు, మనీశ్ అగర్వాల్, అలీ హుస్సేన్, కోటేశ్వరరావు తదితరులు వీటిని మారుస్తున్నారని, 40 శాతం కమిషన్ తీసుకునే వీరు, అందులో 25 శాతం తాముంచుకుని, 15 శాతం ఖత్రికి ఇస్తున్నారని తేల్చారు. అయితే, పాత నోట్లను ఎలా మారుస్తున్నారన్న విషయం మాత్రం పోలీసులు తేల్చలేకపోయారు.
తాము అరెస్ట్ చేసిన వారిలో ఓ తెలుగు వ్యక్తి, ఐటీ కంపెనీ పేరును చెప్పాడని, అందులోని ఎక్కువ మంది ఉద్యోగులు ఎన్నారైలని, వారి ద్వారా మారుస్తున్నట్టు చెప్పాడని పోలీసు వర్గాలు అంటున్నాయి. అయితే, ఎన్నారైలు పాత నోట్లను మార్చుకునే సమయం పూర్తయిన ఆరు నెలల తరువాత కూడా నోట్లు ఎలా మారుతున్నాయన్నది వారికి సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది. హైదరాబాద్ లోనే నోట్ల మార్పిడి సాగుతోందని, దీన్ని ఛేదిస్తామని పోలీసు వర్గాలు అంటున్నాయి.