North Korea: హాంకాంగ్ విమానం వెంట నార్త్ కొరియా మిసైల్... భయకంపితులైన ప్రయాణికులు!
- ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన నార్త్ కొరియా
- దాదాపు 700కు పైగా విమానాలు ప్రయాణిస్తున్న రూట్ లో క్షిపణి
- కిమ్ నిర్లక్ష్యానికి నిదర్శనమన్న రెక్స్ టిల్లర్ సన్
అది శాన్ ఫ్రాన్సిస్కో నుంచి హాంకాంగ్ వెళుతున్న విమానం. ఉత్తర కొరియా ప్రయోగించిన ఖండాంతర క్షిపణి ఆ విమానంలో ప్రయాణిస్తున్న వారికి కనిపించగా, భయంతో, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వారు కూర్చోవాల్సి వచ్చింది. ఈ ఘటన గత సంవత్సరం నవంబర్ 28న జరుగగా తాజాగా వెలుగులోకి వచ్చింది., కిమ్ నిర్లక్ష్యానికి, దుందుడుకు తనానికీ ఈ ఘటన నిదర్శనమని అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్ సన్ విమర్శలు గుప్పించారు.
ఫెడరల్ ఏవియేషన్ అధికారులు అందించిన వివరాల ప్రకారం, ఈ విమానానికి కేవలం 280 నాటికల్ మైళ్ల దూరంలో ఈ క్షిపణి ఉంది. ఆ సమయంలో అదే దారిలో మరో 9 విమానాలు కూడా వెళుతున్నాయి. ఆ రోజు మొత్తం మీద 716 విమానాలు ఆ క్షిపణి రేంజ్ లోనే ప్రయాణించాయి. ఈ విషయాలను వాంకోవర్ లో మీడియాకు చెప్పిన టిల్లర్ సన్, ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షలు విధించాల్సి వుందని అన్నారు. కొరియా క్షిపణి ప్రయాణిస్తుండటంతో పలు విమానాల రూట్లను అప్పటికప్పుడు మార్చాల్సి వచ్చిందని అన్నారు. జపాన్ తీర ప్రాంతానికి 155 మైళ్ల దూరంలో విమానం ప్రయాణిస్తున్న వేళ ఈ ఘటన జరిగిందని ఆయన అన్నారు. కిమ్ వైఖరి అన్ని దేశాల ప్రజలకూ నష్టదాయకమేనని అన్నారు.