Arun Jaitly: వేతన జీవికి శుభవార్త... పెరగనున్న సెక్షన్ 80 సీ పరిమితి!

  • 80సీ మినహాయింపును మరో రూ. 50 వేలు పెంచే అవకాశం
  • రూ. 1.50 లక్షల నుంచి రూ. 2 లక్షలకు పెంపు
  • బడ్జెట్ లో నిర్ణయం తీసుకోనున్న అరుణ్ జైట్లీ

నెలవారీ వేతనం తీసుకుంటూ, సంపాదించిన డబ్బులో కొంతభాగాన్నైనా దాచుకోలేక, పెరుగుతున్న ధరలను చూసి భయపడుతూ ఉండే మధ్య తరగతి వేతన జీవులకు కొంత మేలు కలిగించేలా వచ్చే నెలలో పార్లమెంట్ ముందుకు రానున్న బడ్జెట్ లో కీలక నిర్ణయాలు వెలువడవచ్చని తెలుస్తోంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పరిమితి ప్రస్తుతం రూ. 1.5 లక్షలుగా ఉండగా, దాన్ని రూ. 2 లక్షలకు పెంచుతూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.

 ఈ పరిమితిని రూ. 2 లక్షలకు పెంచితే వేతన జీవులకు రూ. 15,450 (30 శాతం) వరకూ ఆదా అవుతుంది. సెక్షన్ 80 సీ కింద బీమా, ఈక్విటీ లింక్డ్ మదుపు పధకాలు, పోస్టల్ డిపాజిట్లు, సుకన్యా సమృద్ధి, జాతీయ పొదుపు పథకాలు, పన్ను ఆదా చేసేలా ఐదేళ్ల కాలపరిమితిలో ఉండే బ్యాంకు డిపాజిట్లు తదితర మార్గాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ మొత్తాన్ని ఐటీ రిటర్నుల్లో చూపి రాయితీలను పొందవచ్చు. 2014-15లో ఈ పరిమితిని లక్ష నుంచి లక్షన్నర రూపాయలకు పెంచిన సంగతి తెలిసిందే. కాగా, ఈ దఫా పన్ను రాయితీ పెంపు అన్ని రకాల డిపాజిట్లకు వర్తిస్తుందా? అన్న విషయంలో స్పష్టత రావాల్సి వుంది.

Arun Jaitly
Budget
Income Tax
80C
  • Loading...

More Telugu News