Tenali: వార్త రాయకుండా ఉండేందుకు రూ. 40 లక్షలు అడిగిన లేడీ ఎడిటర్ ... సీసీ కెమెరాలు పెట్టి బుక్ చేసిన యువకులు!
- మీడియా పేరుతో బెదిరింపులు
- తెనాలిలో 'కమిలి' సాగించిన దందా
- కేసు నమోదు చేసిన పోలీసులు
మీడియా పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న ఓ పత్రిక ఎడిటర్ సహా మరో ముగ్గురి ముఠాను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పట్టించారు యువకులు. గుంటూరు జిల్లా తెనాలిలో చర్చనీయాంశమైన ఈ ఘటన పూర్వాపరాల్లోకి వెళితే, పట్టణంలో కొందరు యువకులు గ్రూపుగా ఏర్పడి, పలు రకాల ప్రొడక్టులను ఆన్ లైన్ ద్వారా క్రయ విక్రయాలు చేస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న వార్తా పత్రిక 'కమిలి' రిపోర్టర్ కృష్ణారావు బెదిరింపులకు దిగాడు. వారి ఆట కట్టించాలన్న ఉద్దేశంతో చర్చలకు రావాలని పిలిచిన యువకులు, గదిలో రహస్య కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆపై వారితో మాట్లాడేందుకు పత్రిక సంపాదకురాలు మండవ సౌజన్య, విలేకరులు అప్పికొండ ప్రసాద్, దేవవరపు నరేష్ బాబు వచ్చారు.
సౌజన్య వారితో చర్చిస్తూ, ఆన్ లైన్ ట్రేడింగ్ కు చేయాలంటే భారీగా జీఎస్టీ కట్టాల్సి వస్తుందని, విషయమంతా తమ పత్రికలో రాస్తే, కోటి రూపాయలు ప్రభుత్వానికి కట్టాల్సి వుంటుందని, తమకు రూ. 40 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. కాసేపు చర్చల అనంతరం రూ. 20 లక్షలు ఇచ్చేందుకు బేరం కుదుర్చుకుని వెళ్లింది. ఆపై యువకులు వీడియో సాక్ష్యాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.