Cock Fight: ‘బరి’ తెగించిన కోడి.. రూ.400 కోట్లు మాయం చేసింది!
- సుప్రీం ఆదేశాలను తుంగలో తొక్కిన నిర్వాహకులు
- బరులు గీసి కత్తి కట్టిన వైనం
- ఒక్క కృష్ణా జిల్లాలోనే రూ.200 కోట్ల లావాదేవీలు
- మూడు రోజులు సందడిగా మారిన ఏపీ
కోళ్ల కొట్లాటలో కోట్లు ఎగిరిపోయాయి. కోడి పందేల మాటున కోట్లాది రూపాయలు చేతులు మారాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి నిర్వహించిన పందెం మాటున అక్షరాలా నాలుగు వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఈ దెబ్బకు కొందరు కోటీశ్వరులు కాగా, ఇంకొందరు ఉన్నది పోగొట్టుకుని లబోదిబోమంటున్నారు.
భోగి, సంకాంత్రి, కనుమ పండుగలను పురస్కరించుకుని ఈ మూడు రోజుల్లో కోళ్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఆ మాటునే బెట్టింగులు, పేకాటలు, గుండాటలు, పొట్టేళ్ల పోటీలతో ఏపీ హోరెత్తింది. ఇక గోదావరి, కృష్ణా జిల్లాల్లో అయితే చెప్పనక్కర్లేదు. పండుగ మూడు రోజులు మొత్తం రూ.400 కోట్లు చేతులు మారగా, ఒక్క కృష్ణా జిల్లాలోనే రూ.200 కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయి.
పందేల నిర్వహణకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం, పోలీసులు తీసుకున్న చర్యలు ఫలితానివ్వలేకపోయాయి. పందేల నిర్వాహకులు ఎక్కడికక్కడ బరులు ఏర్పాటు చేసి పందేనికి సై అన్నారు. ఈసారి పోటీల్లో మహిళలు కూడా బరిలోకి దిగడం విశేషం.
పెనమలూరులో పోటీలను చూడడానికి వచ్చిన వారు, ఆడేవారితో 65వ నంబరు జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. రూ.500 నుంచి రూ.50 లక్షల వరకు కోళ్లపై పందేలు కాశారు. కోడి పందేలకు తోడు సైడ్ లైట్స్‌గా కోసుముక్కలాట, పేకాట, గోళీ కొట్టుడు, చిత్తుబొమ్మలాట కూడా పెద్ద ఎత్తున జరిగాయి. వీటిలోనూ కోట్లాది రూపాయలు చేతులు మారాయి.