Pope Framcis: అణు యుద్ధానికి ఒక్క అడుగు దూరంలో ప్రపంచం... చాలా భయంగా ఉందన్న పోప్
- చిలీ బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడిన పోప్
- హవాయిపై అణుదాడి జరగనుందని పొరపాటున ప్రచారం
- ఘటనను గుర్తు చేసుకుని ఈ పరిస్థితి వద్దని హితవు
అణ్వాయుధాలతో ప్రపంచ యుద్ధానికి కేవలం ఒక్క అడుగు దూరంలోనే ఉన్నామని క్రైస్తవ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిలీ పర్యటనకు బయలుదేరిన ఆయన, మీడియాతో మాట్లాడుతూ, హవాయిపై అణు దాడి జరగనుందని పొరపాటున జరిగిన ప్రచారాన్ని ప్రస్తావించారు. ఇటువంటి పొరపాట్లు విపరీత పరిణామాలకు దారి తీస్తాయని, వీటిని చూస్తుంటే తనకు చాలా భయంగా ఉందని అన్నారు.
ఏ దేశం కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలను పెంచుకోరాదని సూచించిన ఆయన, ఏ రెండు దేశాల మధ్యా యుద్ధం సంభవించరాదని అభిలషించారు. కాగా, వాటికన్ అధికారులు, నాగసాకిపై అమెరికా అణు బాంబు వేసిన తరువాత తీసిన ఓ చిత్రాన్ని బహుకరించగా, దాన్ని చూసి చలించి పోయిన పోప్, అది తన మనసును కలచివేసిందని, దీన్ని కాపీలు తీయించి అందరికీ పంచుతానని తెలిపారు.