Harik pandya: నిర్లక్ష్యంగా వ్యవహరించి వికెట్ పారేసుకున్న పాండ్యా.. క్షమించరాని నేరమన్న గవాస్కర్
- సింగిల్ కోసం ప్రయత్నించి వికెట్ పారేసుకున్న పాండ్యా
- క్రీజులోకి వచ్చినా బ్యాట్ మోపడంలో విఫలం
- వెల్లువెత్తుతున్న విమర్శలు
టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాపై విమర్శల జడివాన కురుస్తోంది. దక్షిణాఫ్రికాతో సెంచూరియన్‌లో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించి రనౌట్ అయిన పాండ్యాపై మాజీ క్రికెటర్లు, అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అయితే పాండ్యా క్షమించరాని నేరం చేశాడని వ్యాఖ్యానించాడు. అంతగా విమర్శల పాలవుతున్న పాండ్యా చేసిందేమిటంటే..
కేప్‌టౌన్‌లో జరిగిన తొలి టెస్టులో ఓటమి పాలైన భారత్ సిరీస్‌లో 0-1తో వెనుకబడింది. దీంతో సెంచూరియన్ టెస్ట్ కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉంటాయి. లేదంటే భారత్ వరస విజయాలకు బ్రేక్ పడుతుంది. వికెట్లన్నీ టపటపా కోల్పోతున్న వేళ సంయమనంతో ఆడాల్సిన పాండ్యా ఉత్త పుణ్యానికే వికెట్ సమర్పించుకున్నాడు.
ఇన్నింగ్స్ 68వ ఓవర్‌లో రబడా వేసిన తొలి బంతికి పాండ్యా సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బంతి ఫిలాండర్ చేతుల్లోకి వెళ్లింది. గమనించిన పాండ్యా పరుగు తీయకుండా తిరిగి వెనక్కి వచ్చాడు. అదే సమయంలో చేతికి అందిన బంతిని ఫిలాండర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా, నేరుగా వికెట్ల వైపు విసిరి గిరాటేశాడు. బంతి వికెట్లను తాకడానికి ముందే పాండ్యా క్రీజులోకి చేరుకున్నాడు. అయితే బ్యాట్ కానీ, పాదం కానీ క్రీజులో మోపకపోవడంతో అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు. క్రీజులోకి చేరుకున్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే హార్ధిక్ ఔటయ్యాడంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక కెప్టెన్ కోహ్లీ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.