Amavasya: నేడు ఆంజనేయునికి బరువైన కొబ్బరికాయ కొట్టాలట... లేకుంటే అరిష్టమట... జనాల పరుగులు.. వాస్తవం లేదంటున్న పూజారులు!
- అమావాస్య నాడు కనుమ రావడంతో చేటు
- పిల్లలున్న వారు పెద్ద కొబ్బరికాయలు కొట్టాలట
- హనుమాన్ ఆలయాలకు పోటెత్తుతున్న భక్తులు
ఈ సంక్రాంతి అరిష్టమని, ఇది పోవాలంటే హనుమంతుని గుడిలో చిన్న పిల్లలతో ప్రదక్షిణలు చేయించాలని నిన్న జరిగిన ప్రచారానికి నేడు మరో వదంతి తోడైంది. పిల్లలున్న వారు హనుమంతుని గుడిలో సాధ్యమైనంత బరువున్న కొబ్బరికాయ కొట్టాలన్నది నేడు వైరల్ అవుతున్న పుకారు. అమావాస్య రోజున కనుమ పండగ రావడంతో కష్టాలు సంభవిస్తాయని, అవి పోవాలంటే పిల్లలున్న మహిళలు, వారిని తీసుకుని దేవాలయాలకు వెళ్లాలని, ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయలు కొట్టాలని పుకార్లు షికారు చేస్తున్నాయి.
వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మొదలైన ఈ ప్రచారం, తెలుగు రాష్ట్రాల్లో వైరల్ కాగా, ఆంజనేయుని దేవాలయాల ముందు భక్తుల క్యూ లైన్లు పెరిగిపోయాయి. కొబ్బరికాయలకు ఎక్కడలేని డిమాండ్ రాగా, వ్యాపారులు అధిక ధరలకు వాటిని విక్రయిస్తున్నారు. ఇదంతా ఉత్తుత్తి పుకారేనని, నమ్మాల్సిన అవసరం లేదని అర్చకులు చెబుతున్నప్పటికీ, వినే పరిస్థితి లేదు.