UK: ప్రేమను అంగీకరించని తండ్రిని బాంబులతో చంపాలనుకున్న యువకుడు.. ఎనిమిదేళ్ల జైలు!
- కన్న తండ్రిపై కక్ష పెంచుకున్న యువకుడు
- కారు కింద బాంబు పెట్టి చంపేందుకు పథక రచన
- దొరికిపోయి కటకటాల పాలు
తాను ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి అంగీకరించని తండ్రిపై కక్ష పెంచుకున్న కుమారుడు బాంబులతో తండ్రిని చంపేయాలని ప్లాన్ వేసి దొరికిపోయాడు. ఈ కేసులో దోషిగా తేలిన యువకుడికి కోర్టు ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించింది. లండన్‌లో జరిగిందీ ఘటన.
భారత సంతతికి చెందిన గుర్‌తేజ్ సింగ్ రంధావా (19) ను గతేడాది మేలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్‌లైన్‌లో పేలుడు పదార్థాలు ఆర్డర్ చేయడంతో గుర్తించిన బ్రిటన్ నేషనల్ క్రైమ్ ఏజెన్సీ (ఎన్‌సీఏ) అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
తన గాళ్ ఫ్రెండ్‌ను తండ్రి అంగీకరించడం లేదన్న కోపంతో ఆయనను చంపడమో, లేదంటే తీవ్రంగా గాయపరచడమో చేయాలని గుర్‌తేజ్ భావించాడు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో పేలుడు పదార్థాలు ఆర్డర్ చేశాడు. క్రిప్టో కరెన్సీ ద్వారా మొత్తాన్ని చెల్లించాడు. అయితే దీనిని పసిగట్టిన పోలీసులు పేలుడు పదార్థాలు డెలివరీ కాకముందే గుర్‌తేజ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
పేలుడు పదార్థాలను కొనుగోలు చేయడం, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. విచారణలో అతడు చెప్పిన విషయాలు విని పోలీసులు అవాక్కయ్యారు. బాంబును కారు కింద అమర్చి తండ్రిని చంపాలనుకున్నట్టు చెప్పడంతో విస్తుపోయారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం గుర్‌తేజ్‌ను దోషిగా తేల్చింది. ఎనిమిదేళ్ల శిక్ష విధిస్తూ శనివారం తీర్పు చెప్పింది.