Shikhar Dhawan: శిఖర్ ధవన్ ఎప్పుడూ బలిపశువే.. సునీల్ గవాస్కర్

  • ధవన్ మెడపై ఎప్పుడూ కత్తి వేలాడుతూ ఉంటుంది
  • ఇషాంత్ కోసం బుమ్రానో, షమీనో తప్పిస్తే సరిపోయేది
  • ఒక్క చెత్త ప్రదర్శనతో జట్టు నుంచి తీసేయడం దారుణం

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టుకు భారత జట్టును ఎంపిక చేసిన సెలక్టర్లు, కెప్టెన్ కోహ్లీపై ఇప్పటికే విమర్శల జడివాన కురుస్తుండగా తాజాగా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కూడా విమర్శల బాణం ఎక్కుపెట్టాడు. జట్టు కూర్పును తప్పుబడుతూ శిఖర్ ధవన్‌కు మద్దతు ప్రకటించాడు. రెండో టెస్టు కోసం ప్రకటించిన జట్టులో ధవన్‌కు చోటు లేకపోవడంపై గవాస్కర్ స్పందిస్తూ.. ధవన్ మెడపై ఎప్పుడూ కత్తి వేలాడుతూనే ఉంటుందని అన్నాడు. జట్టులో అతడో బలిపశువుగా మారాడని ఆవేదన వ్యక్తం చేశాడు.

దక్షిణాఫ్రికాతో శనివారం ప్రారంభమైన రెండో టెస్టు కోసం భారత్ మూడు మార్పులు చేసింది. శిఖర్ ధవన్ స్థానంలో కేఎల్ రాహుల్‌ను, భువనేశ్వర్ కుమార్ స్థానంలో ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహా ప్లేస్‌లో పార్థివ్ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. శిఖర్ ధవన్‌ను జట్టు నుంచి తప్పించడంపై గవాస్కర్ మాట్లాడుతూ.. ‘‘శిఖర్ ధవన్ ప్రతిసారీ ‘బలి కా బక్రా (బలిపశువు) అవుతున్నాడు.  అతడి మెడపై ఎప్పుడూ కత్తి వేలాడుతూ ఉంటుంది. అతడిని  జట్టు నుంచి పంపించడానికి ఒకే ఒక్క చెత్త ప్రదర్శన చాలు’’ అని అన్నాడు.

భువనేశ్వర్ స్థానంలో ఇషాంత్ శర్మ ఎలా వచ్చాడో? ఎందుకు వచ్చాడో? తనకు అర్థం కావడం లేదన్నాడు. కేప్‌టౌన్ టెస్టులో ఆరంభంలోనే మూడు వికెట్లు తీసిన భువీని పక్కన పెట్టి ఇషాంత్‌ను తీసుకోవడం ఏమిటని సెలక్టర్లను ప్రశ్నించాడు. ఒకవేళ ఇషాంత్‌నే తీసుకోవాలనుకుంటే షమీనో, బుమ్రానో తప్పించి ఇషాంత్‌కు అవకాశం ఇచ్చి ఉండాల్సిందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.

Shikhar Dhawan
Sunil Gavaskar
Team India
South Africa
  • Loading...

More Telugu News