Bollywood: ‘పద్మావత్’పై మళ్లీ వివాదం మొదలు.. పేరు మార్చినంత మాత్రాన ఊరుకోబోమన్న కేంద్రమంత్రి
- వివాదాస్పద సీన్లను తొలగించాల్సిందేనన్న రామ్‌దాస్ అథవాలే
- అప్పటి వరకు వదిలిపెట్టేది లేదని హెచ్చరిక
- సెన్సార్ బోర్డు ఎదుట కర్ణిసేన ఆందోళన
వివాదాలకు కేంద్ర బిందువైన బాలీవుడ్ సినిమా ‘పద్మావతి’ పేరు మార్చుకుని ‘పద్మావత్’గా మారినప్పటికీ వదిలిపెట్టేది లేదని కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలే హెచ్చరించారు. పేరు మార్చుకున్నంత మాత్రాన సినిమా విడుదలకు అంగీకరిస్తామనుకుంటే పొరపాటేనని, రాజ్‌పుత్‌లను కించపరిచేలా ఉన్న సీన్లను తొలగించేంత వరకు సినిమాను విడుదల కానివ్వబోమని హెచ్చరించారు. ఈ విషయమై త్వరలోనే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) చీఫ్ ప్రసూన్ జోషీని కలుస్తానని అన్నారు.
‘‘సినిమా పేరు మారిస్తే సరిపోదు. రాజ్‌పుత్ సామాజిక వర్గం నుంచి ఇంకా ఆ సినిమాపై అభ్యంతరాలున్నాయి. వారు సూచించిన సీన్లను తొలగించే వరకు సినిమాను విడుదల కానివ్వం’’ అని అథవాలే స్పష్టం చేశారు. సినిమా పేరును మాత్రమే మార్చారని, అయితే ఇప్పటికీ అవే సీన్లు, అదే సినిమా అని మంత్రి పేర్కొన్నారు. సినిమా విడుదలకు ముందే వివాదాస్పద సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేశారు.
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పద్మావత్’కు సెన్సార్ బోర్డు క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ కర్ణిసేన శుక్రవారం సీబీఎఫ్‌సీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించింది.