Drunken Drive: డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఇదో కొత్త ట్విస్ట్... వెంటనే పట్టేసిన పోలీసులు!
- తప్పించుకునేందుకు వాలెట్ డ్రైవర్లను వాడిన మందుబాబులు
- అనుమానంతో పోలీసుల ఆరా
- ఆరుగురిపై కేసులు నమోదు
పూటుగా మద్యం తాగి రోడ్లపై వాహనాలు నడిపేవారిని పట్టేసేందుకు పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా, వారి నుంచి తప్పించుకునేందుకు మందుబాబులు ఓ కొత్త ఎత్తుగడ వేశారు. అయితేనేం, పోలీసులు దాన్ని వెంటనే పసిగట్టి వారి ప్లాన్ విఫలం చేశారు. మందుబాబులు వేసిన కొత్త ప్లాన్ ఏంటో తెలుసా?... పోలీసులు చెకింగ్ చేస్తున్న ప్రాంతం నుంచి తప్పించుకోవడం కోసం వాలెట్ డ్రైవర్ల చేతిలో స్టీరింగ్ ను పెట్టడం. గత రాత్రి హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.
పబ్బుల్లో అర్థరాత్రి వరకూ గడిపిన మందుబాబులకు జూబ్లీహిల్స్ చెక్ పోస్టు సమీపంలో తనిఖీలు జరుగుతున్నాయని తెలిసింది. వెంటనే సదరు పబ్ కు చెందిన వాలెట్ డ్రైవర్ల చేతికి స్టీరింగ్ ఇచ్చి, తాము తనిఖీలను దాటేంత వరకూ దాటించమని చెప్పారు. వాలెట్ డ్రైవర్లు కూడా అలానే చేశారు. జూబ్లీహిల్స్ దాటగానే, బంజారాహిల్స్ ప్రాంతంలోనూ తనిఖీలు సాగుతున్నాయి. అక్కడ కూడా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు జరుగుతున్నాయని తెలుసుకోలేని మందుబాబులు అడ్డంగా దొరికిపోయారు.
ముందు తనిఖీలు జరుగుతుండగా, అక్కడ పట్టుబడకుండా, తమ వద్ద పట్టుబడటం ఏంటన్న అనుమానం బంజారాహిల్స్ పోలీసులకు వచ్చింది. వెంటనే విషయం ఆరాతీస్తే, ఈ వాలెట్ డ్రైవర్ల విషయం బయటకు వచ్చింది. దీంతో మొత్తం ఆరుగురు వాలెట్ డ్రైవర్లపై కేసులు పెట్టారు పోలీసులు. గత రాత్రి 40కి పైగా కార్లు, బైకులను స్వాధీనం చేసుకున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.