sashikala: జైల్లో రెండు కోర్సులు చేస్తున్న శశికళ!
- కన్నడ కోర్సుకు హాజరవుతున్న శశి
- కంప్యూటర్ క్లాసులకు కూడా
- కన్నడ రాయడం ఇప్పటికే వచ్చేసింది
అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో శిక్షను అనుభవిస్తున్న దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ విద్యార్థినిగా మారిపోయారు. జైల్లో ఆమె కన్నడ భాష నేర్చుకుంటున్నారు. పరప్పన జైల్లో ఖైదీల కోసం ప్రత్యేకంగా అడల్ట్ లిటిరసీ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కన్నడ రాయడం, చదవడం నేర్పుతున్నారు. ఈ తరగతులకు శశికళ కూడా హాజరవుతున్నారని జైలు అధికారులు తెలిపారు.
దీనికితోడు, కంప్యూటర్ క్లాసులకు కూడా ఆమె హాజరవుతున్నారట. తన బంధువు ఇళవరసితో కలసి క్లాసులకు శశి హాజరవుతున్నారు. ప్రస్తుతం శశికళ కన్నడలో మాట్లాడలేక పోతున్నప్పటికీ, రాయడం మాత్రం నేర్చుకున్నారట. శిక్షణ ముగిసిన తర్వాత వీరికి సర్టిఫికెట్లు కూడా ఇవ్వనున్నారు. మరోవైపు, పుస్తకాలు చదవడం పట్ల కూడా శశికళ ఆసక్తి కనబరుస్తున్నారట.