chopper missing: ఓఎన్జీసీలో హై టెన్షన్.. ముంబయ్ లో ఉద్యోగులతో వెళ్తున్న హెలికాప్టర్ గల్లంతు!
- హెలికాప్టర్ లో ఇద్దరు పైలట్లు, ఐదుగురు ఉద్యోగులు
- టేకాఫ్ అయిన పావు గంటకు గల్లంతు
- కొనసాగుతున్న గాలింపు చర్యలు
ముంబై సమీపంలో సముద్రంలోకి వెళ్లిన ఓఎన్జీసీకి చెందిన ఓ హెలికాప్టర్ మిస్ అయింది. ఈ హెలికాప్టర్ లో ఇద్దరు పైలట్లు సహా ఐదుగురు ఓఎన్జీసీ ఉద్యోగులు ఉన్నారు. పవన్ హాన్స్ కు చెందిన ఈ హెలికాప్టర్ ఈ ఉదయం 10.20 గంటలకు ముంబైలోని జుహు నుంచి టేకాఫ్ అయింది. ఆ తర్వాత 10.35 గంటలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో సంబంధాలను కోల్పోయింది. ఆ సమయంలో ముంబైకు 30 నాటికల్ మైళ్ల దూరంలో హెలికాప్టర్ ఉంది.
ముంబై హై నార్త్ ఫీల్డ్ కు వెళ్తున్న సమయంలో ఇది గల్లంతైంది. ట్రాఫిక్ కంట్రోల్ తో సంబంధం తెగిపోయిన వెంటనే కోస్ట్ గార్డ్స్ ను అప్రమత్తం చేశారు. ప్రస్తుతం గాలింపు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దీనిపై ఓ అధికారి మాట్లాడుతూ, ఇప్పటికే షిప్, ఎయిర్ క్రాఫ్ట్ ను రంగంలోకి దించామని చెప్పారు. షెడ్యూల్ ప్రకారం నార్త్ ఫీల్డ్ లో ఉదయం 10.58 గంటలకు చాపర్ ల్యాండ్ కావాల్సి ఉందని ఆయన అన్నారు. హెలికాప్టర్ గల్లంతైన నేపథ్యంలో ఓఎన్జీసీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.