Cheta: హేమమాలిని ఇంట్లోకి చిరుత... కుక్కనుకొని తరిమేందుకు చూసిన గార్డు!
- గుర్గావ్ లో నివాసం ఉంటున్న హేమమాలిని
- చిరుతను చూసి కుక్కనుకొని లాఠీతో తరిమిన గార్డు
- విషయం తెలుసుకుని భయంతో పరుగులు
- చిక్కకుండా తప్పించుకున్న చిరుతపులి
"మా ఇంట్లోకి ఓ చిరుతపులి వచ్చింది. మీరు వెంటనే రండి" అప్పటివరకూ విధి నిర్వహణలో బిజీగా ఉండి కాస్తంత నిద్రలోకి వెళ్లిన అటవీ శాఖ అధికారులకు వచ్చిన ఫోన్ అది. ఎవరో సామాన్యులు చేస్తే, అధికారులు కూడా అంత త్వరగా స్పందించే వారు కాదేమో. ఆ ఫోన్ వచ్చింది అలనాటి డ్రీమ్ గర్ల్, ప్రస్తుత బీజేపీ ఎంపీ హేమమాలిని ఇంటి నుంచి. ఇంకాస్త లోతుగా వివరాలు తెలుసుకుంటే, గుర్గావ్ లోకి ప్రవేశించిన ఓ చిరుతపులి హేమమాలినీ ఇంటి ముందు కాపలా కాస్తున్న గార్డు ముందుకు వచ్చింది.
ఇదేదో కుక్కలా ఉందని భావించిన అతను లాఠీ తీసుకుని దాన్ని అదిలించబోయాడు. ఆపై అసలు విషయాన్ని గుర్తించాడు. అది ఓ చిరుతపులి అని తెలుసుకుని భీతిల్లాడు. పరుగులు తీస్తూ, చుట్టు పక్కల వారికి విషయం చెప్పాడు. అటవీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి దాన్ని పట్టుకోవాలని చూసినా అది చిక్కకుండా పారిపోయింది. ఇక చేసేదేమీ లేక, చిరుత కనిపిస్తే, దాని గురించి పట్టించుకోరాదని, వాటిని తరిమినా, పట్టుకునే ప్రయత్నం చేసినా ఎదురు తిరుగుతాయని చెప్పిన అధికారులు, నిదానంగా వెళ్లిపోయారట.