Donald Trump: పోర్న్ స్టార్ తో ట్రంప్ కు సంబంధాలు.. అమెరికాలో మరో కలకలం!
- పోర్న్ స్టార్ స్టిఫానీతో శారీరక సంబంధం
- 2006లో ఇద్దరికీ పరిచయం
- అదే సమయంలో మెలానియాతో వివాహం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా, ఆయనకు సంబంధించిన మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఓ పోర్న్ స్టార్ తో ఆయనకు శారీరక సంబంధాలు ఉన్నట్టు వెల్లడైంది. అధ్యక్ష పదవిని చేపట్టక ముందు ఆమెతో ట్రంప్ శారీరక సంబంధం పెట్టుకున్నారని తెలిసింది. అయితే, ఈ విషయాన్ని ఎక్కడా వెల్లడించకుండా ఉండేందుకు సదరు నటికి భారీ మొత్తంలో ట్రంప్ సొమ్ములు ముట్టజెప్పారని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది.
వివరాల్లోకి వెళ్తే, స్టిఫానీ క్లిఫార్డ్ అనే అమెరికా జాతీయురాలు ఓ పోర్న్ స్టార్. 2006లో ఓ గోల్ఫ్ గేమ్ సందర్భంగా ట్రంప్ కు ఆమె పరిచయం అయింది. అదే సమయంలో మెలానియాను ట్రంప్ మూడో వివాహం చేసుకున్నారు. అయినప్పటికీ, స్టిఫానీతో ట్రంప్ శారీరక సంబంధం పెట్టుకున్నారు.
అధ్యక్ష ఎన్నికల బరిలోకి ట్రంప్ దిగుతున్న సమయంలో, ఈ విషయం గురించి మాట్లాడేందుకు ఆమె ప్రయత్నించింది. దీంతో, విషయం బయటకు పొక్కకుండా చూసేందుకు మైఖెల్ కోహెన్ అనే లాయర్ కు ట్రంప్ బాధ్యతలను అప్పజెప్పారు. ఈ నేపథ్యంలో, ఆమెకు ఏకంగా లక్షా ముప్పై వేల డాలర్లను ముట్టజెప్పి మ్యాటర్ క్లియర్ చేశారు మైఖేల్. విషయం బయటకు రానివ్వకుండా ఆమె వద్ద నుంచి హామీ కూడా తీసుకున్నారు. ఈ విషయాలను ఇప్పుడు వాల్ స్ట్రీట్ జర్నల్ బయటపెట్టింది.
ఈ కథనాలను మైఖేల్ కొట్టిపారేయగా... స్టిఫానీ మాత్రం స్పందించలేదు. వైట్ హౌస్ కూడా ఇవన్నీ కట్టు కథనాలంటూ వ్యాఖ్యానించింది. ఏదేమైనప్పటికీ... ప్రస్తుతం ఈ వ్యవహారం అమెరికాలో కలకలం రేపుతోంది.