Hyderabad: హమ్మయ్య!.. హైదరాబాద్ వాసులకు బిగ్ రిలీఫ్.. సిటీ బస్సుల్లో ఇక చిల్లర సమస్యకు చెక్!
- టికెట్ ధరలను రౌండ్ ఫిగర్ చేసిన ఆర్టీసీ
- తగ్గిన కనీస చార్జి.. ఇప్పుడు రూ.5 మాత్రమే
- సంక్రాంతి నుంచి హైదరాబాద్, వరంగల్‌లో అమలు
- ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు
హైదరాబాద్ సిటీ బస్సుల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న చిల్లర సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. ఇకపై టికెట్ ధరలు అడ్డదిడ్డంగా లేకుండా రౌండ్ ఫిగర్ ఉండేలా తెలంగాణ ఆర్టీసీ సవరించింది. అంటే ఇకపై టికెట్లు అన్నీ రూ.5, రూ.10, రూ.15.. ఇలా ఉంటాయన్నమాట. ఫలితంగా కనీస టికెట్ ధర రూ.5 తగ్గనుంది. రూ.8, రూ.11, రూ.17, రూ.22, రూ.28తో ఉన్న టికెట్ ధరలు రూ.5, రూ.10, రూ.15, రూ.20, రూ.25, రూ.30గా మారనున్నాయి.
సవరించిన ధరలు సంక్రాంతి నుంచి హైదరాబాద్, వరంగల్ నగరాల్లో అమల్లోకి రానున్నాయని ఆర్టీసీ ఎండీ రమణారావు తెలిపారు. చిన్నపిల్లలకు జారీ చేసే హాఫ్ టికెట్ విషయంలోనూ చిల్లర సమస్య తలెత్తకుండా రౌండ్ ఫిగర్ చేసినట్టు పేర్కొన్నారు. ఆర్టీసీ నిర్ణయం విని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిల్లర సమస్యలపై ఇన్నాళ్లకు స్పందించినందుకు ఆర్టీసీకి ధన్యవాదాలు చెబుతున్నారు.