Telugudesam: తెలంగాణకు అదనంగా మరో 2 కోట్ల ఉపాధి పని దినాలను కేటాయించాలి: మంత్రి జూపల్లి
- కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి అమర్‌జిత్ సిన్హాతో భేటీ
- రాష్ట్రంలో ఉపాధి హామీ అమలు తీరుపై చర్చ
- గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం లేకుండా ఉపాధి కూలీ వినియోగానికి అమర్‌జిత్ సానుకూల స్పందన
తెలంగాణా రాష్ట్రానికి అదనంగా మరో 2 కోట్ల ఉపాధి పని దినాలను కేటాయించాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. హైదరాబాద్ లోని ఎన్ఐఆర్డీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి అమర్‌జిత్ సిన్హాతో ఈరోజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉపాధి హామీ అమలు తీరుపై చర్చించారు. తెలంగాణాలో ప్రతి కూలీకి వంద రోజుల పని కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలపై అమర్ జిత్ సిన్హా హర్షం వ్యక్తం చేశారు.
దేశంలోనే ఉపాధి హామీ అమలులో ముందున్న రాష్ట్రాల్లో తెలంగాణా కూడా ఒకటని అన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సిన 725 కోట్ల మెటీరియల్ కాంపోనెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా జూపల్లి కోరారు. దీనిపై ఇప్పటికే కేంద్ర మంత్రిని కూడా పలుమార్లు కలిసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే స్వచ్ఛ తెలంగాణా సాధన దిశగా తాము అనేక చర్యలు తీసుకుంటున్నామని, వందశాతం బహిరంగ మల విసర్జన లేని రాష్ట్రంగా తెలంగాణాను త్వరలోనే మార్చనున్నామని వివరించారు. ఇందుకోసం గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం లేకుండా ఉపాధి కూలీని వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని మంత్రి కోరగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో అమలవుతున్న రూర్బన్, పల్లె ప్రగతి కార్యక్రమాలపై కూడా చర్చించారు.