Pawan Kalyan: ఈ సమస్యకు నేనెట్లా ఫుల్ స్టాప్ పెడతా.. కత్తి మహేశ్ ని కొట్టనా? పవన్ వద్దకు వెళ్లి అడగనా?: తమ్మారెడ్డి
- నేను రాజీ చేయలేను
- ఈ వివాదాన్ని ఆపేయమని ప్రతిరోజూ కత్తి మహేశ్ కు చెబుతున్నా
- అతను అర్థం చేసుకోకపోతే నేనేమి చేయను?
- పవన్ అభిమానులు తిడితే తిట్టారని వదిలేస్తే అసలు సమస్యే ఉండదు : తమ్మారెడ్డి
కత్తి మహేశ్, పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య విమర్శల యుద్ధం ఆపాలని, అది కొనసాగిస్తే ఇది ఎంతదూరమైనా పోవచ్చని ప్రముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సూచించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘ఎవరైనా ఏ అభిప్రాయమైనా చెప్పొచ్చు. మన అభిప్రాయం చెప్పిన తర్వాత ఎవరైనా ఏదైనా మాట్లాడతారు. అతను చెప్పిన దానికి మనం రెస్పాండ్ అవ్వాల్సిన అవసరమే లేదు. చిరంజీవినో, బాలకృష్ణనో, పవన్ కల్యాణ్ నో, మహేశ్ బాబు గారినో నేను చాలాసార్లు ఏదో ఒకటి అని ఉంటాను. అన్నప్పుడల్లా, ఎవరో ఒకరు నన్నూ తిట్టి ఉంటారు. వాళ్లు తిట్టగానే నేను రెస్పాండై, ‘నన్ను తిడతావా?’ అని అంటే, మళ్లీ వాళ్లు తిడతారు. ఇది ఇలానే సాగుతుంది తప్పా, సమస్య పరిష్కారం కాదు..
నాలుగు నెలల నుంచి టైం వేస్ట్ అవుతోంది. ఈ పద్ధతి మంచిది కాదని కత్తిమహేశ్ కు చెప్పాను. మొదటి నుంచీ అతనికి చెబుతూనే ఉన్నా. ఈ వ్యవహారంపై పవన్ కల్యాణ్ స్పందించాలని కత్తి మహేశ్ డిమాండ్ చేసే హక్కు ఉంది. కానీ, స్పందించాల్సిన అవసరం ఉందో? లేదో? అవతలి వాళ్లకే తెలుసు. కత్తి మహేశ్ సమాజానికి కావాల్సిన మనిషి. ఈ కాంట్రావర్సీ వల్ల అతను డైవర్ట్ అయిపోయాడు.ఈ కాంట్రావర్సీలోకి వెళ్లాల్సిన అవసరం అతనికి లేదు.
చాలా చక్కగా కత్తి మహేశ్ తన బతుకు తాను బతుకుతున్నాడు (ఫైనాన్షియల్ గా కాదు విలువలతో). ఈరోజున అతను ఆ విలువలన్నీ పోగొట్టుకుంటున్నాడు. నా ఉద్దేశంలో.. పవన్ అభిమానులు తిడితే తిట్టారని వదిలేస్తే అసలే సమస్య ఉండదు.. వారం రోజుల్లో సమస్య పరిష్కారమవుతుంది. ఈ సమస్యకు నేనెట్లా ఫుల్ స్టాప్ పెడతా! కత్తి మహేశ్ ని కొట్టనా? పవన్ కల్యాణ్ స్పందించాలని కత్తి మహేశ్ అంటున్నాడని చెప్పి ఆయన వద్దకు వెళ్లి అడగనా? నేను రాజీ చేయలేను. ఈ వివాదాన్ని ఇంతటితో ఆపేయమని ప్రతిరోజు నేను కత్తి మహేశ్ కు చెబుతున్నా. ఈ వివాదం వల్ల సమాజానికి కలిగే నష్టం గురించి చెబుతున్నా. కత్తి మహేశ్ అర్థం చేసుకోవాలి! అర్థం చేసుకోకపోతే నేనేమి చేయను?’ అని తమ్మారెడ్డి ప్రశ్నించారు.