NITIN GADKARI: ముంబైలో అంగుళం భూమి కూడా ఇవ్వం... పాకిస్థాన్ సరిహద్దుకు పోండి: నేవీకి షాకిచ్చిన గడ్కరీ
- దక్షిణ ముంబైలో ప్లాట్ కేటాయించాలని కోరిన నేవీ
- సంపన్న ప్రాంతంలో ఇచ్చేది లేదన్న గడ్కరీ
- మళ్లీ నా వద్దకు రావద్దంటూ నేవీకి హితవు
కేంద్ర ఉపరితల రవాణా, షిప్పింగ్ శాఖల మంత్రి నితిన్ గడ్కరీ నేవీకి షాకిచ్చారు. ఖరీదైన దక్షిణ ముంబై ప్రాంతంలో నేవీకి అంగుళం భూమి కూడా ఇచ్చేది లేదన్నారు. సీనియర్ నేవీ అధికారుల సమక్షంలోనే గడ్కరీ కటువుగా మాట్లాడడం గమనార్హం. ‘‘ప్రభుత్వం అంటే మేము. నేవీ, రక్షణ శాఖ కాదు’’ అని గడ్కరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీ ప్లేన్ సేవల ప్రారంభానికి వీలుగా జెట్టీ ఏర్పాటు చేసుకుంటామంటూ ఓ ప్రైవేటు కంపెనీ పెట్టుకున్న దరఖాస్తును నేవీ తిరస్కరించిన నేపథ్యంలో గడ్కరీ ఇలా మాట్లాడడం సందేహాలకు తావిచ్చింది.
‘‘కొంత భూమి కావాలంటూ నేవీ అధికారులు నా వద్దకు వచ్చారు. నేను వారికి అంగుళం కూడా ఇవ్వను. దయచేసి మరోసారి రావద్దు. ప్రతి ఒక్కరూ సంపన్న ప్రాంతమైన దక్షిణ ముంబైలో క్వార్టర్లు, ఫ్లాట్లు నిర్మించాలనుకుంటున్నారు. మేం మిమ్మల్ని (నేవీ) గౌరవిస్తాం. కానీ, మీరు పాకిస్థాన్ సరిహద్దుకు వెళ్లి పెట్రోలింగ్ చేయండి’’ అంటూ గడ్కరీ నియంత్రణ కోల్పోయినట్టు మాట్లాడారు.