supreme court: సుప్రీంకోర్టులో అవాంఛనీయ పరిణామాలు అంటూ... తొలిసారిగా మీడియా ముందుకు వచ్చిన న్యాయమూర్తులు!

  • పాలన సరిగా నడవడం లేదు
  • స్వతంత్రంగా వ్యవహరించే ప్రధాన న్యాయమూర్తి అవసరం
  • విధిలేకే మీడియా ముందుకు వచ్చామన్న న్యాయమూర్తులు

సుప్రీంకోర్టు పాలన సరైన దిశలో సాగడం లేదంటూ సంచలన ఆరోపణలతో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మీడియా ముందుకు వచ్చి గోడు వెళ్లబోసుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మీడియా ముందుకు రావడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఢిల్లీలో జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నివాసంలో నలుగురు సీనియర్ జడ్జిలు సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ ఉన్నారు. మీడియా సమావేశంలో జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మాట్లాడారు.

గత కొన్ని నెలలుగా సుప్రీంకోర్టులో అవాంఛనీయ పరిణామాలు జరుగుతున్నాయన్నారు. సుప్రీంకోర్టు వ్యవస్థ సరిగా నడవడం లేదన్నారు. సుప్రీంకోర్టును సరిగా నడిపించే విషయంలో చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాను ఒప్పించడంలో విఫలమయ్యామని, గత్యంతరం లేకే మీడియా ముందుకు వచ్చామని పేర్కొన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని సరిగా నడిపించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. స్వతంత్రంగా వ్యవహరించే ప్రధాన న్యాయమూర్తి అవసరమన్నారు. జరుగుతున్న పరిణామాలను దేశ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని, ప్రధాన న్యాయమూర్తిని అభిశంసించాలా? లేదా? అన్నది దేశ ప్రజలే నిర్ణయించాలని అన్నారు.

 సమావేశం విశేషాలు 

* ప్రధాన న్యాయమూర్తితో తాము ఏం మాట్లాడిందీ న్యాయమూర్తులు వెల్లడించలేదు
* ఈ రోజు ఉదయం చీఫ్ జస్టిస్ తో తాము భేటీ అయ్యామని, కొన్ని వ్యవహారాలు సజావుగా నడవడం లేదని, దిద్దుబాటు చర్యలు అవసరమని ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ, దురదృష్టవశాత్తూ తమ ప్రయత్నాలు విఫలమైనట్టు చెప్పారు.
* చీఫ్ జస్టిస్ కు తాము కొన్ని నెలల క్రితమే లేఖ ఇచ్చినట్టు చెప్పారు.
* న్యాయవ్యవస్థ నిష్పక్షపాతంగా లేకపోతే ప్రజాస్వామ్యం మనలేదన్నారు.
* న్యాయమూర్తుల మీడియా సమావేశానికి ముందే సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి  బీహెచ్ లోయా హత్య కేసుకు సంబంధించి అన్ని పత్రాలను తమ ముందుంచాలని మహారాష్ట్ర సర్కారును సుప్రీంకోర్టు ఆదేశించింది. లోయా హత్య చాలా తీవ్రమైన అంశంగా సుప్రీంకోర్టు పేర్కొంది. సోహ్రాబుద్దీన్ నకిలీ ఎన్ కౌంటర్ కేసు జడ్జి లోయా ముందు విచారణలో ఉండడం గమనార్హం.

  • Loading...

More Telugu News