team india: బ్యాటింగ్ లైనప్ పై నమ్మకం ఉంచు కోహ్లీ... ప్రతీ మ్యాచ్ కు మార్పులొద్దు: గంగూలీ హితవు
- రెండో మ్యాచ్ కు ప్రస్తుత జట్టునే కొనసాగించాలి
- మిగిలి ఉన్న మ్యాచుల్లో ఫలితాలు రావచ్చు
- జట్టులో మార్పులు చేయాలంటూ వస్తున్న డిమాండ్లపై సౌరవ్ గంగూలీ స్పందన
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి విలువైన సూచనలు చేశాడు. జట్టులో మార్పులు చేయవద్దని, ప్రస్తుత బ్యాటింగ్ లైనప్ పై నమ్మకం కొనసాగించాలని సూచించాడు. కేప్ టౌన్ లో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఓటమి చవిచూసిన అనంతరం జట్టు మేనేజ్ మెంట్ రాణించకపోయినా రోహిత్ శర్మను కొనసాగించాలని, విదేశాల్లో మంచి రికార్డులు కలిగిన అజింక్య రహానేను అలాగే బెంచ్ పైనే ఉంచాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తొలి టెస్ట్ మ్యాచు రెండు ఇన్నింగ్స్ లలో రోహిత్ 21 పరుగులే చేశాడు. ఓపెనర్లు అయిన శిఖర్ ధావన్ యథాప్రకారం అవుట్ కావడంతో అతడ్ని మార్చి కేఎల్ రాహుల్ కు చోటివ్వాలనే డిమాండ్లు వస్తున్నాయి. దీనిపై సౌరవ్ గంగూలీ స్పందించాడు. కేప్ టౌన్ లో శనివారం ప్రారంభం అయ్యే టెస్ట్ మ్యాచ్ కు జట్టులో ఎటువంటి మార్పులు చేయరాదని సూచించాడు. టీమ్ కాంబినేషన్ పై విరాట్ కోహ్లీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు. ప్రతీ మ్యాచ్ కు జట్టులో మార్పులు చేయరాదని, ప్రస్తుత బ్యాటింగ్ పై నమ్మకం ఉంచాలని అభిప్రాయపడ్డాడు. ఇంకా టెస్ట్ మ్యాచులు ఉన్నందున వాటిలో మంచి ఫలితాలు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశాడు.