Nagam Janardhan Reddy: బీజేపీకి టాటా చెప్పిన నాగం.. కాంగ్రెస్‌లో చేరిక?
- తెలంగాణలో బీజేపీకి ఎదురుదెబ్బ
- పార్టీని వీడుతున్నట్టు ప్రకటించిన సీనియర్ నేత నాగం
- అవమానాలు భరించలేకే పార్టీని వీడుతున్నట్టు ప్రకటన
తెలంగాణలో బీజేపీకి మరో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. పార్టీలో తనకు సరైన గుర్తింపు దక్కలేదని భావిస్తున్న మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి గుడ్‌బై చెప్పేశారు. పార్టీని వీడుతున్నట్టు గురువారం సాయంత్రం ప్రకటించారు. కేసీఆర్ ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేస్తున్న తాను పార్టీలో నిరాదరణకు గురయ్యానని విలేకరులతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. తనలాంటి అనుభవజ్ఞుడి సేవలను వినియోగించుకోవడంలో పార్టీ విఫలమైందన్నారు. పార్టీలో తాను పలుమార్లు అవమానానికి గురయ్యానని తెలిపారు. అనుచరులు, అభిమానుల సూచనతోనే తాను పార్టీని వీడుతున్నట్టు స్పష్టం చేశారు.
కేసీఆర్ ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తానన్న నాగం.. కేసీఆర్ వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేస్తానని చెప్పుకొచ్చారు. అయితే ఏ పార్టీలో చేరేది ఆయన చెప్పకున్నా.. నాగం చేరేది కాంగ్రెస్‌లోనేనని అంటున్నారు. ఆయనకు మరో ఆప్షన్ లేదని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో నాగర్‌కర్నూలు నుంచే పోటీ చేస్తానని పేర్కొన్న నాగం, కార్యకర్తలతో చర్చించి తన తదుపరి కార్యాచరణను ప్రకటిస్తానని వివరించారు.