Raghunandan: చిన్నారి శాన్వి హత్యకేసులో రఘుకు మరణశిక్ష.. వచ్చే నెల 23న అమెరికాలో అమలు!
- 2012లో చిన్నారి శాన్వి, ఆమె అమ్మమ్మను హత్య చేసిన రఘు
- 2014లో మరణశిక్ష విధించిన కోర్టు
- పెన్సిల్వేనియాలో మరణశిక్షపై నిషేధం
- నిషేధాన్ని సడలిస్తేనే శిక్ష అమలు
వ్యసనాలకు బానిసై డబ్బుల కోసం పది నెలల చిన్నారి శాన్వి, ఆమె అమ్మమ్మ సత్యవతిని అమెరికాలో అతి కిరాతకంగా హత్య చేసిన యండమూరి రఘునందన్‌కు వచ్చే నెల 23న మరణశిక్ష అమలు చేయనున్నారు. 2012లో రఘు ఈ ఘాతుకానికి పాల్పడగా 2014లో దోషిగా తేల్చిన అమెరికా కోర్టు మరణశిక్ష విధించింది. తాజాగా ఆయనకు ఫిబ్రవరి 23న మరణశిక్ష అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఈ శిక్ష అమలు విషయంలో డైలమా నెలకొంది.
2015 నుంచి పెన్సిల్వేనియాలో మరణశిక్ష అమలుపై నిషేధం ఉంది. రెండు దశాబ్దాలుగా ఇక్కడ మరణ శిక్ష అమలు కాలేదు. గవర్నర్ ఈ నిషేధాన్ని తాత్కాలికంగా సడలించడమో, ఎత్తివేయడమో ఏదో ఒకటి చేస్తే తప్ప రఘుకు మరణశిక్ష అమలు చేయడం సాధ్యం కాదు. ఈ రెండూ జరగకుంటే మరణశిక్ష వాయిదా పడే అవకాశం ఉంది. ఒకవేళ శిక్ష అమలైతే అమెరికాలో మరణశిక్షకు గురైన తొలి ఇండో-అమెరికన్‌గా రఘు చరిత్రకు ఎక్కుతాడు.
విశాఖపట్టణానికి చెందిన రఘునందన్ పెన్సిల్వేనియాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పనిచేశాడు. గుంటూరుకు చెందిన శాన్వి తల్లిదండ్రులు వెన్నా వెంకట్, చెంచులత ఉండే అపార్ట్‌మెంట్‌లోనే రఘు కూడా నివసించేవాడు. వారితో సన్నిహితంగా మెలిగేవాడు. జూదానికి బానిసై పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్న రఘు అప్పులు తీర్చేందుకు శాన్విని కిడ్నాప్ చేసేందుకు పథకం రచించాడు.
2012లో శాన్విని కిడ్నాప్ చేశాడు. ఈ క్రమంలో అడ్డు వచ్చిన ఆమె అమ్మమ్మ సత్యవతిని దారుణంగా హత్య చేశాడు. 50 వేల డాలర్లు ఇవ్వకుంటే పాపను చంపేస్తానంటూ లేఖ వదిలి వెళ్లాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాపను కిడ్నాప్ చేసింది రఘునే అని నిర్ధారించారు. అతడిని అదుపులోకి తీసుకుని అపార్ట్‌మెంట్‌ను గాలించగా ఓ సూట్‌కేసులో శాన్వి మృతదేహం బయటపడింది. కేసును విచారించిన కోర్టు 2014లో రఘునందన్‌కు మరణశిక్ష విధించింది.