Chandrababu: 10 రోజుల్లో 60 లక్షల మంది పాల్గొన్నారు.. ఇది అద్భుతమైన విజయం: చంద్రబాబు
- జన్మభూమిలాంటి కార్యక్రమం ఏ రాష్ట్రంలో లేదు
- చంద్రన్న బీమాపై 71, పెన్షన్లపై 68 శాతం సంతృప్తిగా ఉన్నారు
- ఫిర్యాదులను వేగంగా పరిష్కరించండి
ఈ పది రోజుల జన్మభూమి కార్యక్రమంలో తాను ఎంతో నేర్చుకున్నానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దేశంలోనే మన జన్మభూమి కార్యక్రమం ఒక వినూత్నమైన కార్యక్రమమని, ఇతర రాష్ట్రాలకు కూడా నమూనా వంటిదని తెలిపారు. కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి కార్యక్రమం జరగలేదని చెప్పారు. జన్మభూమి ముగింపు రోజు సందర్భంగా తన నివాసం నుంచి ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పది రోజుల్లో నేర్చుకున్నదంతా, తెలుసుకున్నదంతా డాక్యుమెంటేషన్ చేయాలని ఆదేశించారు. ఈ సమాచారం భవిష్యత్తుకు మార్గ నిర్దేశం చేస్తుందని అన్నారు. ఎలాంటి గొడవలు లేకుండా ఈ కార్యక్రమం జరగడం ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పారు.
గత జన్మభూమి కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులపై ప్రజల్లో వ్యతిరేకత ఉండేదని... వీరిని విమర్శిస్తే చప్పట్లు మార్మోగేవని... ఇప్పుడు వ్యతిరేకత స్థానంలో సానుకూలత వచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు. వ్యతిరేక ప్రచారాలకు వేగం ఎక్కువగా ఉంటుందని... సానుకూల ప్రచారం మొదట్లో నెమ్మదిగా ఉన్నా, క్రమంగా పుంజుకుంటుందని చెప్పారు. 10 రోజుల జన్మభూమి సభల్లో 60 లక్షల మంది ప్రజలు పాలుపంచుకోవడం ప్రజా విజయమని అన్నారు. ఈ జన్మభూమిలో 1.72 లక్షల రేషన్ కార్డులు ఇచ్చామని,... 1,00,635 మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చామని చెప్పారు. 13,72,000 పశువులకు చికిత్స అందించారని తెలిపారు. 9 రోజుల్లో 9,92,000 అర్జీలు వచ్చాయని, వాటిలో ఇప్పటికే 8,51,000 అర్జీలను అప్ లోడ్ చేశామని చెప్పారు. అన్ని ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని ఆధికారులను ఆదేశించారు.
చంద్రన్న బీమాపై 71 శాతం, పెన్షన్లపై 68 శాతం మంది సంతృప్తిగా ఉన్నారని చంద్రబాబు చెప్పారు. జన్మభూమిలో బ్యాంకర్లు నేరుగా పాల్గొనడం గొప్ప విషయమని తెలిపారు. బ్యాంకులు ఇచ్చే రుణాలను లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. రుణాలతో స్వయం ఉపాధి పొందాలని, రీ పేమెంట్ కూడా సరిగా చేయాలని అన్నారు.
జన్మభూమి కార్యక్రమంలో విశిష్ట సేవలు అందించిన వారిని గుర్తించి గౌరవించాలని, అవార్డులిచ్చి సత్కరించాలని ముఖ్యమంత్రి సూచించారు. బెస్ట్ విలేజ్, బెస్ట్ వార్డ్, బెస్ట్ మండల్, బెస్ట్ మున్సిపాలిటీ, బెస్ట్ డిస్ట్రిక్ట్ లతో పాటు బెస్ట్ నోడల్ ఆఫీసర్, బెస్ట్ సాధికారమిత్ర అవార్డులు ఇవ్వాలని ఆదేశించారు. అవార్డులను ఆన్ లైన్లో ప్రకటించాలని చెప్పారు. జన్మభూమిలో ప్రజల భాగస్వామ్యం సరిగా లేని గ్రామాలను గుర్తించాలని... అక్కడ ఎంత అభివృద్ధి జరిగింది? ప్రజల భాగస్వామ్యం లేకపోవడానికి అధికార యంత్రాంగం లోపమా? లేక రాజకీయ నాయకత్వ లోపమా? అనే విషయాలను విశ్లేషించి, నివేదిక అందించాలని ఆదేశించారు.