sivakasi: శివకాశిలో కొనసాగుతున్న బంద్.. ఈ దీపావళికి టపాసులు కష్టమే!
- ముంబై, ఢిల్లీలో టపాసుల విక్రయం నిషేధం
- నిషేధాన్ని ఎత్తివేయాలంటూ 15 రోజులుగా బంద్
- రోడ్డున పడ్డ లక్షల మంది కార్మికులు
శివకాశి టపాసుల తయారీ ఈ ఏడాది కష్టమేనేమో! దీపావళి నాటికి శివకాశి టపాసులు ప్రజలకు అందుబాటులోకి రావడం అనుమానమే అనిపిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోకపోతే దీపావళి టపాసుల మోత పెద్దగా వినిపించేలా లేదు. శివకాశిలో టపాసుల తయారీ కేంద్రాల బంద్ ఇందుకు కారణం. గత 15 రోజులుగా ఈ బంద్ కొనసాగుతోంది. దీంతో లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారు.
ముంబై, ఢిల్లీ నగరాల్లో టపాసుల విక్రయాన్ని నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో బాణసంచా వ్యాపారం పూర్తిగా తగ్గిపోయింది. దీంతో ఈ నిషేధాన్ని ఎత్తివేయాలంటూ దాదాపు 15 రోజులుగా శివకాశిలో బంద్ జరుగుతోంది. నిరసనలో భాగంగా 950 పరిశ్రమలు మూతపడిన కారణంగా దాదాపు 4 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఇప్పటి వరకు రూ. 250 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ బంద్ ప్రభావంతో ఈ ఏడాది దీపావళి నాటికి టపాసుల తయారీ తగ్గే అవకాశం ఉంది. ఒకవేళ బంద్ ఇలాగే కొనసాగితే టపాసుల సరఫరా సాధ్యం కాదని వ్యాపారులు అంటున్నారు.