Railway: పండుగ ఎఫెక్ట్: రైల్వే స్టేషన్లలో కిటకిట... బస్సులకు కటకట!
- జాతరను తలపిస్తున్న రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు
- ఎప్పుడొస్తాయో తెలియని ప్రత్యేక రైళ్లు
- జేబులు నింపుకుంటున్న ప్రైవేటు బస్ ఆపరేటర్లు
- మూడింతలు ఎక్కువ చెల్లిస్తేనే టికెట్
సంక్రాంతి పండుగకు ఊరెళ్లేందుకు పెట్టేబేడా సర్దుకుంటున్నారా? ఒక్క నిమిషం! ఎందుకైనా మంచిది.. ఒక్కసారి ఆలోచించుకోండి. రైల్వే స్టేషన్‌కు వెళ్లాక మనసు మార్చుకోవడం కంటే ఇంటి దగ్గరే ఆ పనిచేస్తే బెటరేమో! ఎందుకంటారా.. పండుగకు వెళ్లే ప్రయాణికులతో రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. రైలు ఎక్కడం కాదు.. ముందు ప్లాట్‌ఫాం పైన నిలబడేందుకు చోటు దక్కడమే మహాభాగ్యం అయింది. రైలు ఎక్కే ప్రయత్నంలో ప్రయాణికులు కిందపడి గాయాలపాలవుతున్న సందర్భాలు ఎక్కువయ్యాయి.
పండుగ రద్దీని తట్టుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించినా అందుబాటులో లేని సమయాలు.. సమాచార లోపం కారణంగా రెగ్యులర్ రైళ్లకు జనాలు పోటెత్తుతున్నారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించే రైళ్లు పూర్తి రద్దీగా మారాయి.
రైళ్లలో ప్రయాణించి గమ్యస్థానాలకు చేరుకోవడం దుర్లభంగా మారడంతో కనీసం ఆర్టీసీ, ప్రైవేటు బస్సులను ఆశ్రయించాలనుకున్న వారికి కూడా ఇబ్బందులు తప్పడం లేదు. పండుగ రద్దీని ప్రైవేటు ట్రావెల్స్ సొమ్ము చేసుకుంటున్నాయి. టికెట్ ధరను అమాంతం పెంచేసి విక్రయిస్తున్నాయి. టికెట్ ధరను మూడింతలు పెంచేసి అమ్ముతున్నారంటూ ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఊరెళ్లేందుకు మరో మార్గం లేక తప్పనిసరి పరిస్థితుల్లో వారు అడిగినంత డబ్బులు చెల్లించాల్సి వస్తోందని చెబుతున్నారు. సంక్రాంతి పండుగ ఏమో కానీ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు పండుగ చేసుకుంటున్నాయని విమర్శిస్తున్నారు. ప్రైవేటు బస్సు ఆపరేటర్లు కూడా తత్కాల్ విధానాన్ని అమలు చేస్తున్నారని చెబుతున్నారు. డిమాండ్ ఉన్న రూట్లలో టికెట్ ధరను మూడు రెట్లు పెంచడంతోపాటు 50 శాతం అదనంగా వసూలు చేస్తున్నట్టు ప్రయాణికులు తెలిపారు. రవాణాశాఖ వీరికి పరోక్షంగా సహకరిస్తోందని ఆరోపిస్తున్నారు.