sbi: ఆఫీసులో తేన్పులు నిషేధం... ఉద్యోగుల‌ను ఆదేశించిన ఎస్‌బీఐ!

  • వినియోగ‌దారుల‌కు, స‌హోద్యోగుల‌కు చిరాకు తెప్పిస్తున్నాయ‌ని వ్యాఖ్య‌
  • కొత్త స‌ర్క్యుల‌ర్‌లో ఆఫీస్ ప్ర‌వ‌ర్త‌న గురించి ప్ర‌స్తావ‌న‌
  • టీ ష‌ర్టులు, జీన్స్‌, స్పోర్ట్స్ షూస్ కూడా నిషేధం

ప్ర‌భుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గ‌జం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆఫీసులో ఉద్యోగుల ప్ర‌వ‌ర్త‌న, అల‌వాట్ల గురించి కొత్త ఆదేశాలు జారీచేసింది. ఇందులో ఆఫీసులో పెద్దగా త్రేంచడాన్ని నిషేధించింది. ముఖ్యంగా స‌మావేశాలు జ‌రుగుతున్న‌పుడు, అత్య‌వ‌స‌ర ప‌నుల్లో ఉన్న‌పుడు త్రేంచ‌కూడ‌ద‌ని ఆదేశించింది. ఇలా చేయ‌డం వ‌ల్ల వినియోగ‌దారుల‌కు, స‌హోద్యోగుల‌కు చిరాకు క‌లిగి, ప‌ని మీద దృష్టిసారించ‌లేక‌పోతున్నార‌ని స‌ర్క్యుల‌ర్‌లో వ్యాఖ్యానించింది.

ఫ్రంట్ ఆఫీస్‌లో ప‌నిచేసే వారు, ఒకే గ‌దిలో ఇతర ఉద్యోగుల మ‌ధ్య ప‌నిచేసేవారు, క‌స్ట‌మ‌ర్ కేర్ డెస్క్‌లో ప‌నిచేసేవారు గ‌ట్టిగా త్రేంచ‌డం అమ‌ర్యాద‌కర చర్య‌. అజీర్తి వంటి కార‌ణాల వ‌ల్ల తేన్పులు వ‌స్తుంటాయి. ఎక్కువ శ‌బ్దంతో మాటిమాటికి త్రేంచ‌డం వ‌ల్ల ఇత‌ర ఉద్యోగుల‌కు ఇబ్బందిగా ఉంటుంద‌ని ఎస్‌బీఐ గ్ర‌హించి, ఈ ఆదేశాలు తీసుకువ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

దీంతో పాటు టీ ష‌ర్టులు, జీన్స్‌, స్పోర్ట్స్ షూస్ వేసుకురావ‌డంపై కూడా ఎస్‌బీఐ నిషేధం విధించింది. 13,000 దేశీయ శాఖ‌ల్లో, 190 అంత‌ర్జాతీయ శాఖ‌ల్లోని దాదాపు 2,68,705 ఉద్యోగుల‌కు ఈ ఆదేశాల‌ను ఎస్‌బీఐ జారీచేసింది. అలాగే అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో పనిచేసే సీనియ‌ర్ పురుష ఉద్యోగులు, క‌స్ట‌మ‌ర్ల‌ను క‌లిసిన‌పుడు సెమీ-ఫార్మ‌ల్ ధ‌రించి, టై క‌ట్టుకోవాల‌ని సూచించింది. సీనియ‌ర్ మ‌హిళా ఉద్యోగులు ఫార్మ‌ల్ భార‌తీయ వ‌స్త్ర‌ధార‌ణ‌లో గానీ, ఫార్మ‌ల్ పాశ్చాత్య వ‌స్త్ర‌ధార‌ణ‌లో గానీ ఉండాల‌ని పేర్కొంది.

  • Loading...

More Telugu News