USA: మా సైన్యం సహకరించదు, ఏ రహస్యమూ చెప్పబోము... అమెరికాకు షాకిచ్చిన పాకిస్థాన్!
- పాక్ కు నిధులను నిలిపివేసిన అమెరికా
- సైనిక, ఇంటెలిజెన్స్ సహకారాన్ని రద్దు చేసిన పాక్
- రెండు దేశాల మధ్యా మాటల యుద్ధం
ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని ఆరోపిస్తూ, పాకిస్థాన్ కు తామందిస్తున్న ఆర్థిక సాయాన్ని నిలిపి వేయాలని అమెరికా నిర్ణయించిన వేళ, పాక్ కూడా అదే స్థాయిలో స్పందించింది. తమ దేశంలో అమెరికా సైన్యానికి అందిస్తున్న సహాయ సహకారాలను వెనక్కు తీసుకుంటున్నట్టు స్పష్టం చేసింది. ఇకపై అమెరికా సైన్యానికి తమ సైన్యం సహకరించబోదని, ఇంటెలిజెన్స్ సహకారాన్ని కూడా ఉపసంహరించుకుంటున్నామని పాక్ రక్షణ మంత్రి ఖుర్రం దస్తగిర్ ఖాన్ స్పష్టం చేసినట్టు 'డాన్' పత్రిక పేర్కొంది.
పాక్ భూభాగంపై స్థావరాలను ఏర్పాటు చేసుకుని, ఐఎస్ఐ అందించే నిఘా నివేదికల ఆధారంగా ఆఫ్గనిస్థాన్ ఉగ్రవాదులపై యూఎస్ సైన్యం దాడులు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఆఫ్గన్ లో యూఎస్ విజయానికి తమ సైన్యమే కారణమని వ్యాఖ్యానించిన ఖుర్రం ఖాన్, తీసుకున్న సహాయాన్ని అమెరికా మరచిపోయిందని అన్నారు. 2018లో ట్రంప్ పాక్ ను ఉద్దేశించి తొలి ట్వీట్ చేసిన తరువాత, రెండు దేశాల మధ్యా మాటల యుద్ధం మొదలైన సంగతి తెలిసిందే.