Google: గూగుల్ ఆఫీసులో చోరులు... వారానికి 250 గూగుల్ 'జీబైక్స్'ను ఎత్తుకెళుతున్నారట!
- పర్యావరణ పరిరక్షణ కోసం సైకిళ్లు
- వాటిని ఎత్తుకెళ్లిపోతున్న ప్రజలు
- నివారించేందుకు జీపీఎస్ ట్రాకర్లను ఏర్పాటు చేస్తున్న గూగుల్
టెక్ దిగ్గజం గూగుల్ ఇప్పుడో కొత్త సమస్యను ఎదుర్కొంటోంది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలోని మౌంటెన్ వ్యూ నగరంలో ఉన్న గూగుల్ కార్యాలయాల్లో పర్యావరణాన్ని పాడుచేయకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఆకర్షణీయమైన సైకిళ్లను ఉచితంగా గూగుల్ అందిస్తుండగా, ఆ సైకిళ్లను ఎంచక్కా ఎత్తుకెళ్లిపోతున్నారట.
క్యాంపస్ లో తిరిగే నిమిత్తం 'జీబైక్స్' పేరిట పసుపు రంగు ఫ్రేమ్, రెడ్ బాస్కెట్, గ్రీన్, బ్లూ వీల్స్ తో వెరైటీగా కనిపించే సైకిళ్లను సంస్థ అందుబాటులోకి తెచ్చింది. వీటి ధరలు 100 డాలర్ల నుంచి 300 డాలర్ల వరకూ ఉండగా, క్యాంపస్ పార్కింగ్ లో ఉంచిన సైకిళ్లను తీసుకెళుతున్నవారు, వాటిని తిరిగి వెనక్కు తీసుకురావడం లేదని సంస్థ వర్గాలు వెల్లడించాయి. తాము 1,100 సైకిళ్లను ఉచితంగా అందిస్తుండగా, వారంలో 100 నుంచి 250 సైకిళ్లు మాయం అవుతున్నాయని అధికారి ఒకరు చెప్పినట్టు 'వాల్ స్ట్రీట్ జర్నల్' తెలిపింది.
మౌంటెన్ వ్యూ నగరంలో 80 వేల మంది నివసిస్తుండగా, వారంతా గూగుల్ సైకిళ్లను వాడుతున్నారని తెలిపింది. దీనిని అరికట్టేందుకు ఇటీవల ప్రతి సైకిల్ కూ జీపీఎస్ ట్రాకర్లను అమర్చే పనిని ప్రారంభించినట్టు అధికారులు వెల్లడించారు. ఇక ఐదు వ్యాన్లను, 30 మంది ఉద్యోగులను నియమించిన గూగుల్ 'జీబైక్స్' ఎక్కడున్నాయో కనిపెట్టి తెచ్చే పనిని వారికి అప్పగించిందట.