Telangana: స‌ర్పంచ్‌ల‌కు విస్తృతాధికారాలు క‌ల్పించేలా తెలంగాణ నూత‌న పంచాయ‌తీరాజ్ చ‌ట్టం?

  • నూత‌న పంచాయ‌తీరాజ్ చ‌ట్టంపై రెండోరోజు సుదీర్ఘ చ‌ర్చ
  • స‌ర్పంచ్‌ల చేతికే పూర్తిగా కార్యనిర్వ‌హ‌ణాధికారాలు?
  • న్యాయ‌ప‌ర‌మైన ఇబ్బందులు రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని మంత్రుల స‌బ్ క‌మిటీ సూచన

నూతన పంచాయతీ రాజ్ చట్టం రూపకల్పనపై తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ వరుసగా రెండో రోజూ సమావేశమైంది. ప్రగతి భవన్ లో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు కేటీఆర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తుమ్మ‌ల నాగేశ్వ‌రరావు, ఈట‌ల రాజేంద‌ర్‌, ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చ‌ట్ట రూప‌క‌ల్ప‌న‌లో తీసుకోవాల్సిన న్యాయ‌ప‌ర‌మైన అంశాల‌పై అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ ప్ర‌కాశ్ రెడ్డితోనూ సుదీర్ఘంగా చ‌ర్చించారు. స‌ర్పంచ్‌ల చేతికే కార్య నిర్వ‌హ‌ణాధికారాల‌ను పూర్తిగా అప్ప‌గించే దిశగా పంచాయతీ రాజ్ కొత్త చట్టం సిద్ధం అవుతోంది. సర్పంచ్ ల విధులు, నిధులు, కార్య‌నిర్వ‌ాహ‌క‌ అధికారాల‌తో పాటు స‌ర్పంచ్‌ల‌కు అప్ప‌గించాల్సిన బాధ్య‌త‌ల‌పైనా ప్ర‌ధానంగా చ‌ర్చించారు.

ప్ర‌జల సౌల‌భ్యం, గ్రామ పంచాయ‌తీల స‌ర్వ‌తోముఖాభివృద్ధికి దోహ‌దప‌డేలా నూత‌న చ‌ట్టం ఉండాల‌ని, ఇందులో ఎలాంటి న్యాయ‌ప‌ర‌మైన ఇబ్బందులు రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని స‌బ్ క‌మిటీ సూచించింది. గ్రామాల్లో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేసేందుకు, వారి అభిప్రాయాల‌ను తెలుసుకునేందుకు వీలుగా గ్రామ‌స‌భ‌ను త‌ప్ప‌కుండా నిర్వ‌హించేలా చ‌ట్టంలో మార్పులు చేయాల‌నే అభిప్రాయం వ్య‌క్తమైంది. కాగా, ప్ర‌స్తుతం ఉన్న పంచాయతీ రాజ్ చ‌ట్టంలో స్వ‌యం స‌హాయ‌క సంఘాలు లేదా ఫంక్ష‌న‌ల్ గ్రూప్‌ల నుండి కో- ఆప్ష‌న్ స‌భ్యుడిని తీసుకోవ‌చ్చ‌నే అంశం పొందుప‌ర్చి ఉన్న‌ప్ప‌టికీ అది అమ‌లు కావ‌డం లేదు. దీనిని అమ‌లు చేసే అంశంపైనా చ‌ర్చించారు.

రాష్ట్రంలోని ఏ గ్రామంలో అయినా లే- అవుట్లతో పాటు గ్రౌండ్ ప్ల‌స్ రెండు అంత‌స్తుల క‌న్నా ఎక్కువ చేప‌ట్టే భ‌వ‌న నిర్మాణాలకు హైద‌రాబాద్‌లోని ప‌ట్ట‌ణ, గ్రామీణ ప్ర‌ణాళిక శాఖ నుంచే అనుమ‌తి పొందాల్సి వ‌స్తోంది. దీనిని కొంత స‌ర‌ళీక‌రిస్తూ జిల్లాల్లోనే డీపీఓల ఆధ్వ‌ర్యంలో నిపుణుల క‌మిటీ ఏర్పాటు చేసే అంశమై చ‌ర్చించారు. ఈ క‌మిటీ కూడా నిర్ణీత కాల ప‌రిమితిలోగా ద‌ర‌ఖాస్తును తిర‌స్క‌రించ‌డమో, ఆమోదించ‌డ‌మో చేసేలా ఓ అంశాన్ని చ‌ట్టంలో పొందుప‌ర్చే విషయమై చర్చించడం జరిగింది. అలాగే, వ‌రుస‌గా రెండు ఎన్నిక‌ల‌కు ఒకే రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేయాల‌నే అంశంపైనా సబ్ కమిటీ చర్చించింది. రేపు, ఎల్లుండి కూడా ఈ సబ్ కమిటీ సమావేశం కానుంది.

  • Loading...

More Telugu News