jet airways: స్మగ్లింగ్ కేసులో జెట్ ఎయిర్ వేస్ ఎయిర్ హోస్టెస్ అరెస్ట్.. కోట్లాది రూపాయల స్వాధీనం!
- ఇండియా నుంచి విదేశాలకు నల్లధనం
- అక్కడి నుంచి ఇక్కడకు బంగారం
- అరెస్ట్ చేసిన రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు
హవాలా రాకెట్ లో భాగస్వామిగా ఉండి, కోట్లాది రూపాయలను విదేశాలకు తరలిస్తున్న జెట్ ఎయిర్ వేస్ ఎయిర్ హోస్టెస్ దేవశ్రీ కుల్ శ్రేష్టను ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి రూ. 3.21 కోట్ల విలువైన అమెరికన్ డాలర్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. జనవరి 8వ తేదీన ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్ హోస్టెస్ అరెస్ట్ ను జెట్ ఎయిర్ వేస్ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఆమెను విధుల నుంచి తొలగించామని... అధికారుల విచారణ అనంతరం ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తామని చెప్పింది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, సదరు ఎయిర్ హోస్టెస్ ఇక్కడి నుంచి విదేశాలకు నల్లధనాన్ని తీసుకెళ్లి, తిరుగు ప్రయాణంలో బంగారాన్ని తీసుకొస్తోంది. ఓ హవాలా ఆపరేటర్ తో కలసి ఆమె పని చేస్తోంది. ఆమె స్మగుల్ చేసిన మొత్తంలో ఆమెకు ఒక్క శాతం కమిషన్ వస్తుంది. గత రెండు నెలల కాలంలో ఇండియా నుంచి హాంగ్ కాంగ్ కు ఆమె 10 లక్షల అమెరికన్ డాలర్లను స్మగుల్ చేసింది. స్మగ్లింగ్ సందర్భంగా, ఈ డబ్బును ఫాయిల్ పేపర్ లో ప్యాక్ చేస్తారు. దీంతో, స్కానర్లు ఈ డబ్బును అంత ఈజీగా గుర్తించలేవు. గత ఏడాదే దేవశ్రీ వివాహం చేసుకుంది.